బెదిరింపులపై రాష్ట్రపతికి ఫిర్యాదు

Published: Friday March 19, 2021

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో శుక్రవారం ఎంపీ రఘురామకృష్ణరాజు భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో తాజా పరిస్థితులను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లినట్టు ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతో తనపై జరుగుతున్న దాడులను వివరించానన్నారు. నియోజక వర్గానికి వెళ్లలేని స్థితిని, దాడులు చేస్తామని చేసిన బెదిరింపులను వివరించినట్టు తెలిపారు. పోలీసు కేసులతో అన్యాయంగా అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారన్నారు. తన ఫిర్యాదును కేంద్ర హోం మంత్రికి పంపిస్తానని రాష్ట్రపతి హామీ ఇచ్చారన్నారు. త్వరలో రాష్ట్రపతి సూచన మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలుస్తానన్నారు.

 

గతంలో ఎన్నికలు వద్దని రాద్ధాంతం చేసిన తమ పార్టీ నేతలు, ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. రాష్ట్ర సంక్షేమం, నిమ్మగడ్డ తన సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మిగిలిన ఎంపీటీసి, జడ్పీటీసి ఎన్నికలు పూర్తిచేయాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ అఖిలపక్షంతో ప్రధానిని కలవడానికి సమయం కోరానన్నారు. కానీ అఖిలపక్షంలో ఉండే వారిని ఇంకా ఖరారు చేయలేదన్నారు. తనకు కేంద్ర హోం మంత్రిని కలవడానికి అపాయింట్మెంట్ ఇప్పించే విషయంపై రాష్ట్రపతి కార్యాలయం ఫాలో ఆప్ చేస్తుందన్నారు.