మేజిస్ట్రేట్‌కు రఘురామరాజు ఫిర్యాదు

Published: Sunday May 16, 2021

 à°¸à±€à°à°¡à±€ కస్టడీలో ఉన్న తనను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కొట్టారని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలిపారు. తన కాళ్లను తాళ్లతో కట్టేసి... అరికాళ్లపై కర్రలు, ఫైబర్‌ లాఠీలతో కొట్టారని తెలిపారు. గాయాలతో కమిలిపోయి ఉన్న పాదాలను జడ్జికి చూపించారు. ఇది తీవ్ర సంచలనం సృష్టించింది. రఘురామ బెయిలు పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చడంతో.. సీఐడీ పోలీసులు ఆయనను శనివారం సాయంత్రం గుంటూరులోని సీఐడీ ప్రత్యేక న్యాయస్థానమైన ఆరో మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరిచారు. ఎంపీ నడవడానికి ఇబ్బంది పడుతూ... కష్టం మీద కోర్టులోకి ప్రవేశించారు. తనను అరెస్టు చేసినప్పటి నుంచి కోర్టు ముందు హాజరుపరిచే వరకు చోటుచేసుకున్న పరిణామాలన్నింటిపైనా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తానని కోరారు. అందుకు మెజిస్ట్రేట్‌ అరుణకుమారి అంగీకరించటంతో 4 పేజీల ఫిర్యాదును అందించారు. 

 

‘‘శుక్రవారం రాత్రి సీఐడీ కార్యాలయంలో నేను నిద్రపోవడానికి సిద్ధమవుతుండగా.. ముఖాలకు కర్చీ్‌ఫలు కట్టుకున్న ఐదుగురు వ్యక్తులు వచ్చారు. నా రెండు కాళ్లను తాడుతో కట్టారు. ఒకడు నన్ను కర్రతో కొట్టాడు. మరొక వ్యక్తి... రబ్బరు కర్ర(ఫైబర్‌ లాఠీ)తో నా రెండు అరికాళ్లపై కొట్టాడు. తర్వాత.. నన్ను గదిలో అటూఇటూ నడవమన్నారు. నేను నడిచాను. à°† తర్వాత మళ్లీ అరికాళ్లపై కొట్టారు. మళ్లీ నడవమన్నారు. ఈసారి నేను నడవలేకపోయాను. అప్పుడు వాళ్లు వెళ్లిపోయారు’’ అని రఘురామ తెలిపారు. అరెస్టు తర్వాత తన పట్ల అమానుషంగా వ్యవహరించారంటూ కొందరు అధికారుల పేర్లను కూడా ప్రస్తావించారు. కోర్టులో న్యాయవాదులందరినీ బయటకు పంపి... ఎంపీ రఘురామకృష్ణంరాజు పేర్కొన్న అంశాలను మేజిస్ట్రేట్‌ రికార్డు చేసుకున్నారు. à°† తర్వాత విచారణ సందర్భంగా... ఆయనను ప్రభుత్వ ఆస్పత్రికి పంపిస్తామని మేజిస్ట్రేట్‌ చెప్పగా... ఎంపీ తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంపీని గుంటూరులోని రమేశ్‌ హాస్పటల్‌కు తరలించాల్సిందిగా అభ్యర్థించారు. దీనిపై మేజిస్ట్రేట్‌ స్పందిస్తూ.. ‘‘నిందితుడి పాదాలు కమిలిపోయి ఉన్నాయి. వైద్య పరీక్షలు కచ్చితంగా అవసరం. ప్రభుత్వ ఆస్పత్రి, రమేశ్‌ ఆస్పత్రి వైద్యులు, కేంద్రం కల్పించిన వై-కేటగిరీ భద్రత సమక్షంలోనే పరీక్షించాలి. గాయాలు ఎందుకు? ఎప్పుడు అయ్యాయో రికార్డు చేయాలి’’ అని ఆదేశించారు.

‘‘ఎంపీనైన నన్ను అరెస్టు చేసినప్పటి నుంచి సీఐడీ అధికారులు అనేకరకాలుగా ఇబ్బందులుపెట్టారు. అరెస్టుకు ముందు లోక్‌సభ స్పీకర్‌కు సమాచారం ఇవ్వలేదు’’ అని రఘురామ కోర్టుకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐడీ అధికారులు స్పీకర్‌కు సమాచారం ఇస్తామంటూ.. రిమాండ్‌ రిపోర్టును సరిచేసి మెజిస్ట్రేట్‌ ముందు పెట్టారు. రిమాండ్‌ రిపోర్టును తిరస్కరించాలని, ఇది కేవలం ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పెట్టిన తప్పుడు కేసు అని ఎంపీ తరఫున న్యాయవాదులు కోరారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపితే రాజద్రోహం సెక్షన్‌ ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు. మిగిలిన రెండు సెక్షన్లు కూడా ఏడేళ్లు శిక్ష పడేవే అని... సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఎంపీకి 41(ఏ) ప్రకారం నోటీసులు జారీ చేసి, స్టేషన్‌ బెయిల్‌ మంజూరు చేయాలని తెలిపారు. ‘‘కొన్ని నెలల క్రితమే ఎంపీకి గుండె ఆపరేషన్‌ జరిగింది. గ్యాస్ర్టోఎంట్రాలజీ చికిత్స తీసుకున్నారు. కొవిడ్‌ బారిన పడ్డారు. à°ˆ దృష్ట్యా.. ఆయనను ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించాలి’’ అని కోరారు. 

రఘురామకృష్ణంరాజుకు 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ మేజిస్ట్రేటు ఆదేశాలు జారీ చేశారు. à°ˆ నెల 28à°¨ తిరిగి కోర్టు ముందు హాజరుపరచాలని రిమాండ్‌ పేర్కొన్నారు.

ఎంపీ రఘురామకృష్ణంరాజుపై సీఐడీ అధికారుల థర్డ్‌ డిగ్రీపై విచారణకు ఆరో మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ఆదేశించిందని ఆయన తరపు న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు. తొలుత జీజీహెచ్‌లో వైద్య బృందం ఎంపీ ఒంటిపై ఉన్న గాయాలను పరిశీలిస్తుందన్నారు. à°† తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి, చేపట్టాల్సిన వైద్య సేవలపై జీజీహెచ్‌ వైద్యుల బృందం à°“ నివేదిక ఇస్తుందన్నారు. à°† తర్వాత ఎంపీని రమేష్‌ హాస్పిటల్‌కు తరలించాలన్నారు. అక్కడ కూడా థర్డ్‌ డిగ్రీకి సంబంధించిన గాయాలు, ఆయన ఆరోగ్య పరిస్థితిపై అక్కడి వైద్యులు కూడా కోర్టుకు నివేదిక ఇవ్వాల్సి ఉంటుందన్నారు. వీరితోపాటు హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన త్రిసభ్య కమిటీ కూడా ఎంపీ రఘురామకృష్ణంరాజును పరిశీలించి హైకోర్టుకు నివేదిక ఇస్తుందన్నారు.

   

శనివారం సాయంత్రం రఘురామ రాజును ఆరో మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ కోర్టుకు తీసుకొచ్చారు. à°ˆ సందర్భంగా సీఐడీ అధికారులు మీడియాను పూర్తిగా నియంత్రించారు. కోర్టు ప్రాంగణంలోకి కూడా రానివ్వకుండా మెయిన్‌ గేటు వద్దనే అడ్డుకున్నారు. ఎంపీ కాళ్లకు ఉన్న గాయాలను ఫొటోలు తీస్తున్న న్యాయవాదులతో పోలీసులు వాదనకు దిగారు.  ఎంపీ ఒంటిపై గాయాలు ఉన్నాయని, ఆయనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని తెలుసుకున్న వెంటనే హైకోర్టు నుంచి ఆయన తరపు న్యాయవాదులు లక్ష్మీనారాయణ, గోపీనాథ్‌ హుటాహుటిన మున్సిఫ్‌ మెజిస్ర్టేటు కోర్టుకు వచ్చారు. అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసులు వారిని కూడా అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, న్యాయవాదులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కోర్టు హాలులోకి న్యాయవాదులను వెళ్లకుండా అడ్డుకోవటం మొదటిసారిగా చూస్తున్నామని, తమ విధుల్లో జోక్యం చేసుకోవడమేమిటని నిలదీశారు. కొద్ది సేపటి తర్వాత పోలీసులు వారిని లోపలికి అనుమతించారు.

 

 à°Žà°‚పీ రఘురామకృష్ణంరాజు సుప్రీం కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణ రావు శనివారం స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. విచారణలో భాగంగా ఆయనను తీవ్రంగా హింసించారని పిటిషన్‌లో పేర్కొన్నట్లు తెలిసింది. త్వరలో à°ˆ పిటిషన్‌ విచారణకు వచ్చే అవకాశం ఉంది.