జీవో 2ను ఉపసంహరించుకోవాలి

‘‘గ్రామ పంచాయతీలకు సమాంతరంగా వలంటీర్లు, కార్యదర్శుల వ్యవస్థను ఏర్పాటు చేయడం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేయడమే. ఇది అప్రజాస్వామికం. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం సర్పంచుల అధికారాలలో కోత విధించడం రాజ్యాంగ విరుద్ధం. ఈ నేపథ్యంలో సర్పంచుల అధికారాలకు విఘాతం కలిగించే జీఓ నంబరు 2ను ప్రభుత్వం తక్షణమే, బేషరతుగా ఉపసంహరించుకోవాలి’’ అని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో ఆదివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి 8వ లేఖ రాశారు. మహాత్మాగాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం నినాదానికి స్ఫూర్తిగా గ్రామ సర్పంచులు స్వయం పాలన సాగించాల్సి ఉందన్నారు. గ్రామ సర్పంచుల చెక్ పవర్ విషయంలో స్పష్టత లేదని చెప్పారు. చెక్ పవర్‌ను సర్పంచ్, ఉప సర్పంచులకు కలిపి ఇస్తామని ప్రభుత్వం చెబుతుండగా... గ్రామ కార్యదర్శి, సర్పంచికి కలిపి ఇస్తామని అధికారులు చెబుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం సర్పంచులకు చెక్‌పవర్ లేకపోవడంతో గ్రామ పంచాయతీలలో నిధులు సమకూర్చుకోలేక అభివృద్ధి పనులన్నీ నిలిచిపోయాయయని ఆవేదన వ్యక్తం చేశారు. పరిపాలనాపరమైన లోపాల కారణంగా గ్రామాలలో అనిశ్చితి నెలకొందని, దీంతో గ్రామీణ ప్రజలకు ప్రభుత్వంపై విశ్వసనీయత పోతోందని అన్నారు. గ్రామ కార్యదర్శులు, వలంటీర్లు, పంచాయతీ సిబ్బంది సర్పంచులకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం లేదన్న రాజ్యాంగ విరుద్ధమైన జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
పంచాయతీరాజ్ వ్యవస్థను బలహీనపరుస్తూ సమాంతర వ్యవస్థ ఏర్పాటు దేశంలో మరెక్కడా లేదన్నారు. ప్రజలచేత ఎన్నుకోబడిన సర్పంచులకు ప్రత్యామ్నాయంగా వలంటీర్లను నియమించడం ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమే అవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యలపై క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి, చాలా మంది ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత ఉందన్నారు. అయితే ఎమ్మెల్యేల వ్యతిరేకత ప్రస్తుతానికి బయటపడకపోయినా, భవిష్యత్‌లో బహిర్గతమవుతుందని హెచ్చరించారు. కాగా, వలంటీర్లు కనీస వేతనాల చట్టం-1948 పరిధిలోకి రాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుని, వారికి పారితోషికం పేరుతో చెల్లించడం కూడ సబబు కాదని రఘురామరాజు పేర్కొన్నారు.

Share this on your social network: