మాయలో పడి.. మజిలీతో ముగించారు

Published: Saturday October 02, 2021

చై–సామ్‌ పదేళ్ల ప్రేమ బంధం, నాలుగేళ్ల వివాహబంధానికి ఫుల్‌స్టాప్‌ పెట్టారు నాగచైతన్య–సమంత. మనస్ఫర్థతలతో వీరిద్దరూ విడిపోతున్నారనే వార్త గత రెండు నెలలుగా నెట్టింట వైరల్‌ అవుతోంది. దానికి తోడు సోషల్‌ మీడియా ఖాతాలో సమంత తన పేరు ముందున్న ‘అక్కినేని’ని తొలగించడంతో ఇష్యూ మరింతగా హాట్‌గా మారింది. అప్పటి నుంచి గాసిప్పులు మార్మోగుతూనే ఉన్నాయి. దీనిపై ఈ జంట ఎక్కడ నోరు మెదపలేదు. ఏదో ముహూర్తం పెట్టినట్లు ఈ రోజు మధ్యాహ్నాం 3.30 నిమిషాలకు తమ విడాకుల విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా బయటపెట్టారు చై–సామ్‌. 

2010లో గౌతమ్‌మీనన్‌ దర్శకత్వం వహించిన ‘ఏమాయ చేశావె’ చిత్రంతో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ సినిమాలో ఈ జంట కార్తీక్‌–జెస్సీగా తెరపై కెమిస్ట్రీని పండించారు. అక్కడ మొదలైన పరిచయం కొన్నాళ్లకు స్నేహంగా మారింది. 2011లో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘ఆటోనగర్‌ సూర్య’ చిత్రం మొదలైంది. ఈ సినిమా జర్నీలో ఇద్దరూ మరింత దగ్గరయ్యారు. ఆ సినిమా పూర్తయ్యి విడుదల కావడానికి దాదాపు నాలుగేళ్ల సమయం పట్టింది. ఈ  ప్రయాణంలో ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నారు. మొదటి నుంచీ ఇద్దరి మధ్య మంచి అండర్‌స్టాండింగ్‌, ఒకరికి ఒకరు సపోర్ట్‌గా నిలవడం ఉంది. చైతన్య కొన్ని విషయాలు బయటపెట్టడానికి మొహమాటపడినా... సామ్‌ మాత్రం సందర్భానుసారంగా ఇద్దరి మధ్య ఏదో నడుస్తుంది అన్నట్లు హింట్స్‌ ఇస్తూనే ఉండేది. ‘చైతన్యని ప్రేమిస్తున్నా అని డైరెక్ట్‌గా చెప్పలేదు గానీ, అతనంటే ఇష్టమని చెప్పేదాన్ని. అప్పట్లో ఎవ్వరూ నా మాటల్ని సీరియస్‌గా తీసుకోలేదు. అందుకే మేం ఎవరికీ దొరకలేదు...’’ అని సమంత ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 

సినీరంగంలో సమంతకు తొలి స్నేహితుడు చైతన్య. వృత్తిపరంగానూ, వ్యక్తిగతంగానూ సమంత ఇబ్బందుల్లో ఉన్న సమయంలో చై ఇచ్చిన చేయూతను ఎప్పటికీ మరచిపోలేనని సమంత పలు ఇంటర్వ్యూలో చెప్పారు.ఆ సమయంలో ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారిందని చైతన్య చెబుతారు. ఇద్దరి జీవితాలు మలుపు తిరిగే సమయంలో వాట్‌ నెక్ట్స్‌ అని ఆలోచిస్తే... కలిసి జీవితాన్ని పంచుకోవాలి’ అనే డెసిషన్‌ సరైంది అనిపించడంతో.. సామ్‌ తనంతట తానే బయటపడిందని చైతన్య చెబుతారు. చాలాకాలంగా వీరిద్దరి ప్రేమకథను చాలా గోప్యంగా ఉంచారు. అయితే ‘మనం’ చిత్రం షూటింగ్‌ సమయంలో ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందనే విషయం నాగార్జునకు తెలిసింది. అయితే నాగ్‌ కూడా ఏం చెబుతారో అని ఎదురుచూశారు.