విద్యార్థుల వినూత్న నిరసన

Published: Sunday November 07, 2021

‘మా పాఠశాల నుంచి భోజనానికి అంత దూరం వెళ్లబోం’ అంటూ విద్యార్థులు.. వారికి మద్దతుగా తల్లిదండ్రులు వినూత్నంగా నిరసన తెలిపారు. భోగాపురం ప్రాథమిక పాఠశాల విద్యార్థులు శనివారం స్థానిక విద్యావనరుల కేంద్రం వద్దకు చేరుకుని ఖాళీ ప్లేట్లతో ఆందోళన చేశారు. తమ పాఠశాలను విలీనం చేయవద్దని కోరారు. భోజనం కోసం రహదారిపై కిలోమీటరు దూరం వెళ్లడం తమ వల్ల కాదని వాపోయారు. తల్లిదండ్రులు మాట్లాడుతూ చిన్న పిల్లలు అన్న ఆలోచన లేకుండా రోడ్డుకు అటువైపు దూరంగా ఉన్న ఉన్నత పాఠశాల వద్దకు భోజనం కోసం పంపడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. విలీనం పేరుతో ఇక్కడి విద్యార్థులను హైస్కూల్‌కు పంపిస్తే ఊరుకునేది లేదన్నారు. ఆందోళనలో తల్లిదండ్రులు ఎ.లక్ష్మి, అప్పలరాజు, రామలక్ష్మి, రాము తదితరులు పాల్గొన్నారు.