సిఎం రమేష్ దీక్ష విరమణ....

Published: Saturday June 30, 2018

కడపలో స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సిఎం రమేష్ దీక్షను విరమించారు. ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం 11 రోజులుగా దీక్ష చేస్తున్న రమేష్ కు చంద్రబాబునాయుడు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. ఎన్ని రోజులు దీక్ష చేసినా కేంద్రప్రభుత్వం నుండి స్పందన రావటం లేదు. పైగా చంద్రబాబు, సిఎం రమేష్ తో పాటు టిడిపి ఎంపిలను కేంద్రం ఏమాత్రం ఖాతరు చేయటం లేదు. దాంతో దీక్ష విషయంలో ఎలా ముందుకుపోవాలో అర్ధ కావటం లేదు. దానికితోడు రమేష్ దీక్ష తీరుపై అన్నీ వైపుల నుండి విమర్శలు, ఆరోపణలు,అనుమానాలు పెరిగిపోతున్నాయి.

నిమ్మరసం తాగించిన చంద్రబాబు

దాంతో దీక్ష విషయంలో ఏం నిర్ణయం తీసుకోవాలో రమేష్ కు కూడా దిక్కుతోచలేదు. ఇటువంటి పరిస్దితుల్లో జిల్లా నేతలు చంద్రబాబుతో మాట్లాడి కడపకు పిలిపించారు. చంద్రబాబు దీక్ష వేదిక దగ్గరకు వచ్చి ఎన్నికల సభలో మాట్లాడినట్లు మాట్లాడారు. చివరకు రమేష్ ను దీక్షను విరమించాలంటూ సూచించారు. తర్వాత నిమ్మరసం కూడా తాగించారు. దాంతో మర్గేమాధ్యంగా, పరువు పోగొట్టుకోకుండా రమేష్ దీక్షను విరమించినట్లైంది. ఇంతకూ ఫ్యాక్టరీ విషయంలో కేంద్రం ఎటువంటి నిర్ణయమూ ప్రకటించకుండానే రమేష్ దీక్షను విరమించటం గమనార్హం. మరి, ఇంతోటి దానికి దీక్ష ఎందుకు చేశారో రమేషే చెప్పాలి.

అసలు చంద్రబాబు ఏం చెప్పారు ?

దీక్షా వేదిక నుండి అంతసేపు చంద్రబాబు మాట్లాడినా ఎక్కడా ఫ్యాక్టరీ విషయంలో స్పష్టత లేదు. కేంద్రంతో సంబంధాలు లేకుండానే రాష్ట్రప్రభుత్వమే ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తుందా ? లేకపోతే ప్రైవేటు రంగంలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం చొరవ తీసుకుంటుందా ? అన్న విషయంలో మాత్రం చంద్రబాబు స్పష్టంగా చెప్పలేదు. పైగా ఫ్యాక్టరీ ఏర్పాటుకు జనాలందరూ పోరాటం చేయాలంటూ పిలుపివ్వటమే విచిత్రంగా ఉంది. సరే పనిలో పనిగా దివంగత వైఎస్సార్, జగన్మోహన్ రెడ్డి, గాలి జనార్ధన్ రెడ్డిపై దుమ్మత్తిపోశారు. తర్వాత కడప జిల్లాకు తానెంత ప్రాధాన్యత ఇస్తున్నది చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు.