కార్పొరేట్‌ విద్యకు స్వస్తి పలకాలి: పరిపూర్ణానంద

Published: Sunday August 05, 2018

తెలుగు రాష్ట్రాల్లో హిందువుల పట్ల వివక్ష పెరిగిపోతోందని కాకినాడ శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానందస్వామి ఆరోపించారు. శనివారం ఉదయం సింహాచల వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల తనపై బహిష్కరణ విధించినప్పుడు హిందువులతో పాటు మతాలకు అతీతంగా ఎందరో తమకు మద్దతు పలికారంటూ, విపత్కర పరిస్థితుల్లో మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తన రాజకీయ ప్రవేశంపై భవిష్యత్‌లో ప్రకటిస్తానని చెప్పారు. ప్రస్తుత సమాజాన్ని శాసిస్తున్న కార్పొరేట్‌ విద్యా విధానానికి స్వస్తి పలకాలని, ఎందరో యువతీ, యువకులను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్న ఆధునిక విద్యావిధానాన్ని వదిలి మానవ జీవిత విలువలను బోధించే సనాతన హైందవ విద్యావిధానాన్ని భావితరాలకు అందించాలని సూచించారు. అయ్యప్ప ఆలయంలో మహిళల ప్రవేశంపై మాట్లాడుతూ కోర్టులు కూడా వ్యక్తుల కోసం వ్యవస్థను, సనాతన సంప్రదాయాలను బలి చేయకూడదని అభిప్రాయపడ్డారు. కేసుల విచారణ వేళ హక్కులు వేరు, ఆగమశాస్త్రాలు వేరనే అంశాన్ని కోర్టులు దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఆగమ శాస్త్రాలకు లోబడి అర్చకులు విధులు నిర్వహించాలని సూచించారు.