2 లక్షల మందికి ఐటీ నోటీసులు : నోట్ల రద్దు ప్రభావం

Published: Monday January 22, 2018

ఆదాయపు పన్ను శాఖ సుమారు 2 లక్షల మందికి నోటీసులు జారీ చేసింది. రూ.20 లక్షలకు పైగా విలువగల రద్దయిన రూ.500, రూ.1,000 నోట్లను జమ చేసి, ఆ సొమ్ముకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించనివారికి ఈ నోటీసులను పంపించింది.

 

ఆదాయపు పన్ను శాఖ తెలిపిన వివరాల ప్రకారం రద్దయిన నోట్లను మార్చుకునేందుకు ఇచ్చిన గడువులోగా రూ.20 లక్షలకు పైగా జమ చేసినవారికి ఆ సొమ్ముకు సంబంధించిన వివరాలను తెలియజేయడానికి చాలా సమయం ఇచ్చారు. అయినప్పటికీ సమాచారాన్ని ఇవ్వకుండా, రిటర్నులను దాఖలు చేయకుండా తప్పించుకుంటున్నవారికి ప్రస్తుతం నోటీసులు పంపించారు. రిటర్నులను దాఖలు చేయాలని కోరారు.

 

 

పెద్ద నోట్ల రద్దు తర్వాత రూ.500, రూ.1,000 నోట్ల డిపాజిట్లను పరిశీలించారు. వీటిలో రూ.5 లక్షలకు పైగా డిపాజిట్ చేసినవారిలో 18 లక్షల మందిపై అనుమానం వ్యక్తమైంది. వీరిలో 12 లక్షల మందికి సంబంధించిన వివరాలను ఆదాయపు పన్ను శాఖ పోర్టల్ ద్వారా తనిఖీ చేశారు. రూ.2.9 లక్షల కోట్ల విలువైన అనుమానాస్పద డిపాజిట్లు ఉన్నట్లు గుర్తించారు.

 

భారీ మొత్తంలో డిపాజిట్ చేసినవారిని కొన్ని వర్గాలుగా విభజించి, దశలవారీగా ఒక్కొక్క వర్గంపై చర్యలు తీసుకుంటున్నారు. మొదటి దశలో రూ.50 లక్షలు, అంతకన్నా ఎక్కువ విలువైన రద్దయిన నోట్లను డిపాజిట్ చేసిన 70 వేల మందిపై చర్యలు తీసుకుంది.