లక్ష్యానికి దూరంగా ట్రాక్టర్ల పంపిణీ

Published: Monday January 21, 2019
‘రైతు రథం’ పథకం ముందుకు కదలడం లేదు. వ్యవసాయ యంత్రీకరణలో భాగంగా రైతులకు రాయితీపై ట్రాక్టర్లు అందించే à°ˆ పథకం నత్తనడక నడుస్తోంది. ఖరీఫ్‌ సీజన్‌ ముగిసి, రబీ కూడా చివరి దశకు వస్తున్నా, à°ˆ ఏడాది లక్ష్యంలో ఇంకా 40శాతం ట్రాక్టర్లు పంపిణీ కాలేదు. రాష్ట్రంలో తొలిసారి 2017-18లో రూ.2.50లక్షల సబ్సిడీతో 12,217 ట్రాక్టర్లను ప్రభుత్వం రైతులకు పంపిణీ చేసింది. డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని 2018-19లో గరిష్ఠంగా రూ.2.25లక్షల రాయితీతో మొత్తం 12,121 ట్రాక్టర్లు పంపిణీ చేయాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇప్పటి వరకు 7,148 మాత్రమే రైతులకు అందాయి. నియోజకవర్గానికి కనీసం 60చొప్పున రైతురథం ట్రాక్టర్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్దేశించినా, చాలా నియోజకవర్గాల్లో ఇంత వరకు లక్ష్యాన్ని చేరుకోలేదని అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. అలాగే డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ పద్ధతిలో రూ.లక్షన్నర సబ్సిడీతో ఇచ్చే చిన్న ట్రాక్టర్లు 2,052 లక్ష్యంగా పెట్టుకోగా, 1,230మాత్రమే పంపిణీ చేశారు.
 
రైతురథాల పంపిణీలో పశ్చిమ గోదావరి జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా, శ్రీకాకుళం జిల్లా 13à°µ స్థానంలో ఉంది. à°ˆ జిల్లాలో 649ట్రాక్టర్లు ఇవ్వాలని నిర్ణయించగా, ఇప్పటికి 81మాత్రమే రైతులకు అందాయి. రైతురథాల కోసం à°ˆ ఏడాది వేలమంది దరఖాస్తు చేసుకున్నా జిల్లా ఇన్‌చార్జి మంత్రి సిఫారసు చేసిన వారికే అధికారులు మంజూరు చేస్తున్నారు. కాగితాల్లో మంజూరయినా ట్రాక్టర్లు అందని వారున్నారు. రబీ సీజన్‌ ముగింపు దశకొచ్చినా అదిగో.. ఇదిగో.. అంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారని రైతులు పెదవి విరుస్తున్నారు.