ఇంటిపై చంద్రబాబు తాజా నిర్ణయం ఇదేనా

Published: Wednesday June 26, 2019
నాటకీయ పరిణామాల మధ్య ప్రజావేదిక కాలగర్భంలో కలిసిపోయింది. మాజీ సీఎం వినతిని పట్టించుకోని ఏపీ సీఎం జగన్ ప్రజావేదికను చెప్పినట్టుగానే కూల్చేశారు. à°ˆ కూల్చివేత టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయడం వల్ల జగన్‌కు ఒరిగిందేంటని టీడీపీ ప్రశ్నిస్తుంటే, చంద్రబాబు అక్రమంగా నిర్మించారని.. అందుకే కూల్చేశామని వైసీపీ చెబుతోంది. చంద్రబాబు ప్రజావేదికను తమకు కేటాయించాలని కోరినందువల్లే జగన్ కక్షపూరితంగా వ్యవహరించి ప్రజావేదిక కూల్చివేతకు పూనుకున్నారని టీడీపీ విమర్శిస్తోంది.
 
 
ఇరు పార్టీల మధ్య జరుగుతున్న ఈ మాటల యుద్ధాన్ని కాసేపు పక్కనపెడితే.. ప్రజావేదిక పక్కనే ఉన్న చంద్రబాబు నివాసం కూడా అక్రమమని వైసీపీ పదేపదే చెబుతోంది. ప్రజావేదిక కూల్చివేత విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయంతో ప్రస్తుతం చంద్రబాబు ఉంటున్న నివాసాన్ని కూడా కూల్చివేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే.. చంద్రబాబు నివాసంపై కోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం ఈ చర్యకు పూనుకుంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. కూల్చివేతకు ఏ మాత్రం అవకాశం ఉన్నా సీఎం జగన్ చంద్రబాబు నివాసం విషయంలో ఉపేక్షించే పరిస్థితి లేదని తాజా పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి.
 
 
ఇదిలా ఉంటే.. చంద్రబాబు రాజధాని ప్రాంతంలో ఇంటి కోసం అన్వేషిస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని భావిస్తున్న ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గుంటూరు, విజయవాడకు త్వరగా చేరుకునేందుకు వీలుగా ఇంటిని చూడాలని పార్టీ నేతలకు ఇప్పటికే ఆయన సూచించినట్లు సమాచారం. దీంతో టీడీపీ సీనియర్ నేతలు చంద్రబాబు ఉండేందుకు అనువైన నివాసం కోసం వెతుకులాట ప్రారంభించారట. ఇదిలా ఉంటే.. రాజధాని ప్రాంతంలోని ఉద్ధండరాయునిపాలెం గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నేతలు చంద్రబాబు ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇస్తామని ముందుకొస్తున్నారట.