కశ్మీరు ద్వైపాక్షిక సమస్యే .. మోదీ స్పష్టీకరణ

Published: Tuesday August 27, 2019
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కశ్మీరుపై తన అత్యుత్సాహాన్ని తగ్గించారు. మధ్యవర్తిత్వానికి సిద్ధమేనని గతంలో రెండుసార్లు చెప్పిన ఆయన సోమవారం జీ-7 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీతో శిఖరాగ్ర సమావేశం అనంతరం వెనక్కి తగ్గారు. భారత్‌-పాకిస్థాన్‌లు à°ˆ సమస్యను ద్వైపాక్షికంగా పరిష్కరించుకుంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు. సోమవారం ఫ్రాన్స్‌లోని బియారిడ్జ్‌లో 40 నిమిషాల శిఖరాగ్ర సమావేశం అనంతరం ఇద్దరు దేశాధినేతలు కలిసి మీడియాతో మాట్లాడారు. కశ్మీరులో మూడో పక్షం జోక్యం కుదరదని ట్రంప్‌ ఎదురుగానే మోదీ స్పష్టం చేశారు. ‘‘మేం మూడోపక్షాన్ని ఇబ్బంది పెట్టదలచుకోలేదు. 1947కు ముందు భారత్‌, పాకిస్థాన్‌లు ఒకే దేశం. రెండు దేశాల మధ్య పలు సమస్యలున్నాయి. వాటిని అవి పరస్పరం మాట్లాడుకొని పరిష్కరించుకోగలవు’’ అని మోదీ అన్నారు. ఇటీవల ఇమ్రాన్‌ఖాన్‌తో ఫోన్లో మాట్లాడినపుడు ఇరు దేశాల్లో పేదరికం లాంటి ఎన్నో సమస్యలున్నాయని, ప్రజల సంక్షేమం గురించి ఇరు దేశాలు కలిసి పని చేయాలని పిలుపునిచ్చానని చెప్పారు.
 
ట్రంప్‌ మాట్లాడుతూ, ‘‘మేమిద్దరం కశ్మీరు గురించి మాట్లాడుకున్నాం. పరిస్థితి అదుపులోనే ఉందని మోదీ చెప్పారు. మోదీ, ఖాన్‌.. ఇద్దరితోనూ నాకు మంచి సంబంధాలున్నాయి. వాళ్లిద్దరూ పరిష్కరించుకోగలరని నమ్ముతున్నా’’ అన్నారు. ‘‘మోదీతో వాణిజ్యం, సైన్యం తదితర విషయాలపై మాట్లాడుకున్నాం. ఇద్దరం కలిసి భోజనంచేశాం. భారత్‌ గురించి చాలా విషయాలు తెలుసుకున్నా’’ అన్నారు. జీ-7 సదస్సుకు ప్రత్యేక ఆహ్వానితుడి హోదాలో వచ్చిన సెనెగల్‌ అధ్యక్షుడు మ్యాకీ షాల్‌తో, ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్‌ ఆంటోనియో గ్యూటర్స్‌తో, బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌తో మోదీ విడివిడిగా సమావేశమయ్యారు.