పోటీ పరీక్షల్లో దూకుడు.. ఐఐటీకి వెళ్లాక ఢమాల్‌

Published: Saturday January 18, 2020
తెలుగు విద్యార్థులను క్యాంపస్‌ కష్టాలు వెంటాడుతున్నాయి. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో లక్షల మంది విద్యార్థులతో పోటీ పడి సత్తా చాటుతున్నా, తిరుగులేని ర్యాంకులు కైవసం చేసుకుని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో సీట్లు సంపాయిస్తున్నా, తర్వాత మాత్రం మన వాళ్లు చతికిల పడుతున్నారు. ఐఐటీల్లో చేరే ఇతర రాష్ట్రాల విద్యార్థులతో కలివిడిగా ఉండలేకపోతున్నారు. బృంద చర్చల్లోను, ఇతర కార్యక్రమాల్లోను వెనుకబడిపోతున్నారు. ఫలితంగా ప్రతిష్ఠాత్మక ప్రపంచస్థాయి సంస్థల్లో ఉద్యోగాలను దక్కించుకోలేక ఉసూరుమంటున్నారు. మరి దీనికి కారణాలు ఏంటి? మనోళ్లలో సత్తాలేదా లేక.. సరైన అవగాహనలేదా? ఎందుకు వెనుకబడిపోతున్నారు? ఇప్పుడు వీటిపైనే దృష్టి పెట్టింది రాష్ట్ర ఉన్నత విద్యా మండలి. క్యాంపస్‌ కష్టాలను తరిమికొట్టేలా.. అందరితోనూ కలిసిపోయి.. సత్తా చాటేలా.. అత్యుత్తమ సంస్థల్లో ఉద్యోగాలు దక్కించుకునేలా విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు సిద్ధమైంది. వాస్తవానికి జాతీయ స్థాయిలో నిర్వహించే ఉమ్మడి పోటీ పరీక్షల్లో సత్తా చూపుతూ ఐఐటీలు, డీమ్డ్‌ విద్యా సంస్థల్లో ఏపీ విద్యార్థులు సీట్లు సొంతం చేసుకుంటున్నారు. కానీ, à°† తర్వాత క్రమంలో మాత్రం ఇబ్బంది పడుతున్నారు.
 
 
రాష్ట్రంలో ప్రస్తుతం కార్పొరేట్‌ విద్యాసంస్థల హవా కొనసాగుతోంది. ఇంటర్‌ వరకు విద్యార్థులను తరగతిగదికి పరిమితం చేయడం, అకడమిక్‌ పరంగా ఆయా పాఠ్యాంశాల్లో బట్టీయం విధానంలో విద్యార్థులను సంసిద్ధులను చేయడం వరకే ఆయా సంస్థలు దృష్టి పెడుతున్నాయి. అంతేతప్ప కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, బృంద చర్చలపై దృష్టి పెట్టడంలేదు. ఐఐటీల్లో కనీసం నాలుగైదు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉంటారు. వారితో తెలుగు వాళ్లు కలివిడిగా ఉండలేని పరిస్థితి నెలకొంటోంది. అత్యంత కీలకమైన బృంద కార్యక్రమాల్లోనూ వెనుకబడిపోతున్నారు. అదేసమయంలో నాయకత్వ లక్షణాలు కూడా అంతంత మాత్రంగా ఉంటున్నాయి. ఏపీ విద్యార్థులు ఐటీలో కొంత వరకు ఫర్వాలేదని, కోర్‌ ఇంజనీరింగ్‌, తయారీ రంగంలోను బాగా వెనకబడిపోతున్నారని ముంబయి, మద్రాస్‌, ఖరగ్‌పూర్‌ ఐఐటీలకు చెందిన ప్రొఫెసర్లు అభిప్రాయపడుతున్నారు.