‘మీలో పౌరుషం లేదా..? ఇదంతా నా ఒక్కడికేనా?

Published: Sunday January 19, 2020
 
రాజధాని అమరావతి కోసం ప్రజలంతా ఏకం కావాలి. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, సోమవారం నేరుగా అసెంబ్లీని ముట్టడించాలి. దిగ్బంధం చేయాలి. అప్పుడే ప్రభుత్వం దిగి వస్తుంది’ అని టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు పిలుపిచ్చారు. అమరావతిని సీఎం జగన్‌ సర్వనాశనం చేస్తున్నారని.. à°ˆ పరిస్థితుల్లో అసెంబ్లీ ముట్టడికి ప్రజలంతా సమాయత్తం కావాలని, స్వచ్ఛందంగా తరలి రావాలని, రాజధానిని దక్కించుకోవాలని కోరారు. శనివారం పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన పర్యటించారు. పలుచోట్ల అమరావతి పరిరక్షణ సమితి పక్షాన జోలెపట్టారు. అనేక మంది స్వచ్ఛందంగా విరాళాలు అందించారు. నారాయణపురం, గణపవరం, ఉండి, భీమవరం, పాలకొల్లు, మార్టేరు సభల్లో చంద్రబాబు మాట్లాడారు.
‘మీలో పౌరుషం లేదా..? ఇదంతా నా ఒక్కడికేనా? సమస్య నా ఒక్కడిది కాదని, ఐదు కోట్ల మందిదని తెలుసుకోవాలి. ఇది నా ఒక్కడి బాధ్యత కాదు.. కులం కోసమో, కుటుంబం కోసమో అంతకన్నా కాదు.. ఇదంతా మీకోసం’ అని అన్నారు. సీఎం జగన్‌ అమరావతిపై కక్షకట్టి విధ్వంసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘అమరావతి నిర్మాణం సాధ్యం కాదంటూ ఎన్ని నాటకాలు ఆడుతున్నారు? సీఎం చేతకానితనమిది. ఆయనొక ఉన్మాది. పరిపాలన చేతకాదు’ అని దుయ్యబట్టారు. ఇంకా ఏమన్నారంటే..
వారిని జగనే చంపేశాడు
‘రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చి నేడు అమరావతిని కాపాడుకోవడానికి ప్రాణాలను అర్పిస్తుంటే.. గతంలో సాధారణ మరణాలకే ఓదార్పుయాత్ర చేసిన జగన్‌కు ఇప్పుడు సిగ్గులేదా..? కనీసం ఒక్కరిని కూడా పలకరించడం లేదు. అమరావతి ఉద్యమంలో 20 మంది అసువులు బాశారు. ఇవన్నీ హత్యలే.. జగనే చంపేశాడు.. అటువంటి వ్యక్తిని బలి ఇవ్వాలా.. వద్దా..? కరుడు కట్టిన దుర్మార్గుడు, నరరూప రాక్షసుడైన జగన్‌కు పరిపాలించే అర్హత లేదు. తుగ్లక్‌ నిర్ణయాలు తీసుకుంటున్న ఆయనకు బుద్ధి చెప్పడానికి అసెంబ్లీని ముట్టడిద్దాం. ఎవరికి వారు మౌనంగా కూర్చుంటే సమస్య పరిష్కారం కాదు. రాజధాని రైతులకు అన్యాయం జరుగుతుంటే చూస్తుంటారా? మీలో రోషం లేదా.. పౌరుషం లేదా? మహిళలను దారుణంగా వేధించారు. బూటుకాళ్లతో పొట్టపై తన్నారు. అక్రమంగా కేసులు పెట్టారు. నానావిధాలుగా హింసించారు. పోలీసులూ.. మీరు ఆలోచించుకోండి.. మీకూ భార్యాపిల్లలు, బంధువులు ఉన్నారు. సాటి ఆడపిల్లల మీద దౌర్జన్యం చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. జగన్‌ అభివృద్ధి అవసరమే లేదంటున్నారు. అనేక పథకాలకు పంచుతున్నాం అంటారు, భవిష్యత్‌లో పంచడానికి ఏమీ ఉండదు.. చివరకు పంచె కూడా ఉండదు. విశాఖను ఎవరైనా రాజధానిగా చేయాలని కోరారా..? పులివెందుల రౌడీలు వస్తారని ఇప్పుడు అక్కడి ప్రజలు భయపడుతున్నారు.’