ఆలయాలకు జియో ట్యాగింగ్‌ ;డీజీపీ ఆదేశం

Published: Monday September 14, 2020

‘రాష్ట్రంలో ఏ ఒక్క ప్రార్థనా మందిరంలోనూ ప్రమాదాలు, దుర్ఘటనలు జరగడానికి వీల్లేదు. అందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టండి. ఆలయ కమిటీలతోపాటు ప్రజల సహకారం తీసుకోండి. ఇతర శాఖలతో సమన్వయం చేసుకోండి’ అని జిల్లాల ఎస్పీలకు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ దిశా నిర్దేశం చేశారు. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయ రథం ఆహుతి ఘటన నేపథ్యంలో 13 జిల్లాల్లోని ఆలయాల వద్ద భద్రతపై ఆదివారం   à°œà°¿à°²à±à°²à°¾à°² ఎస్పీలు, బెజవాడ, విశాఖ పోలీసు కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

 

అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకూ జిల్లాల వారీగా ప్రసిద్ధ ఆలయాలు, చర్చీలు, మసీదులు, ఇతర మతాల ప్రార్థనాస్థలాల భద్రత, పరిశీలనలో గుర్తించిన లోపాలు, వాటిని సరిచేసేందుకు చేపట్టిన చర్యల గురించి ఎస్పీలు పోలీస్‌ బాస్‌కు వివరించారు. వీటిపై ఆయన స్పందిస్తూ... ‘మీ పరిధిలోని అన్ని మతాల ఆలయాలకు మూడు రోజుల్లో జియో ట్యాగింగ్‌ పూర్తి చేయాలి. శాంతి కమిటీలను పునరుద్ధరించి, ఆలయ కమిటీలతో చర్చించి అన్ని రకాల రక్షణ చర్యలు చేపట్టండి. చిన్న చిన్న ఆలయాల్లో ఎవరూ లేని చోట పొరుగు వారిని అప్రమత్తం చేయండి. సమాచారం అందగానే పది నిమిషాల్లో ఘటనాస్థలికి చేరుకోవాలి.

 

ఆలయాలకు సంబంధించి ఏదైనా ఆకతాయి పనులు చేసే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదలొద్దు. అనుమానితులపై నిఘా పెట్టండి. బీట్‌ ఏర్పాటు, విద్యుత్‌ ఆడిట్‌ లాంటివి చూసుకోవడం ఎస్‌హెచ్‌వోల బాధ్యత. పర్యవేక్షణ బాధ్యత డీఎస్పీలు, ఎస్పీలదే’ అని స్పష్టం చేశారు. మరో వారం రోజుల్లో ఇంకోసారి సమీక్షిస్తానని, అప్పటికల్లా రాష్ట్రంలో రక్షణలేని, సీసీ కెమెరా ఏర్పాటు కాని ఆలయాలు ఉండరాదన్నారు. వీలైనంత వరకూ శాంతి కమిటీలు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. తర్వాత డీజీపీ విలేకర్లతో మాట్లాడుతూ అంతర్వేది ఘటనలో కుట్రకోణం లేదని, ఇప్పటి వరకూ తమ దర్యాప్తులో తేలిన అంశాలన్నీ సీబీఐకి తెలియజేస్తామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులు ఎవరైనా ఉపేక్షించే ప్రసక్తేలేదన్నారు.