ఒక్క రాజధాని కోసం ఉద్యమిస్తాం

Published: Tuesday December 15, 2020

‘ఏపీ ప్రజలకు అమరావతిలో అద్భుత రాజధానిని బీజేపీ నిర్మించి ఇస్తుంది. మూడు రాజధానులకు మేం వ్యతిరేకం. రెండో ఆలోచనే లేదు. అమరావతే రాజధాని’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. తుళ్లూరులో కిసాన్‌ సంఘ్‌ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన చిన్న, సన్నకారుల రైతుల సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘ప్రధాని మోదీ అమరావతి రైతులతోనే ఉన్నారు. మోదీ ప్రతినిధిగా మాట్లాడుతున్నా. అమరావతిలోనే రాజధాని ఉండాలనేది బీజేపీ లక్ష్యం. ఇందులో రెండో అంశానికి తావు లేదు. ఏపీ బీజేపీ కార్యాలయం విజయవాడలోనే సొంత భూమిలో కడుతున్నాం. జగన్‌ మూడు రాజఽధానుల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.

 

రూ.1800 కోట్లతో నిర్మితమవుతున్న ఎయిమ్స్‌ హాస్పిటల్‌ ఆగిందా? దుర్గమ్మ ఫ్లై ఓవర్‌ పూర్తి చేశామా లేదా? బెంజ్‌సర్కిల్‌ వద్ద రెండు ఫ్లైఓవర్లు కడుతున్నామా? లేదా..? ఇవన్నీ ప్రధాని మోదీ రైతులతోనే ఉన్నారనడానికి నిదర్శనం’ అని సోము స్పష్టం చేశారు. సీఎం జగన్‌లా బీజేపీ మాటా.. మడమా తిప్పదు అని వీర్రాజు వ్యాఖ్యానించారు. రాజధానిగా అమరావతి ఒక్కటే ఉండాలని తాము ఉద్యమం చేపడతామని ప్రకటించారు. ‘2024లో బీజేపీకి రాష్ట్రంలో అధికారం ఇవ్వండి. అమరావతిని రూ.5 వేల కోట్లతో అభివృద్ధి చేస్తాం. రైతుల ప్లాట్‌లకు రూ.2 వేల కోట్లతో అన్ని సౌకర్యాలూ కల్పిస్తాం’ అని తెలిపారు.