పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం

Published: Saturday February 20, 2021

నాలుగో దశ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమని పంచాయతీశాఖ ముఖ్య కార్యదర్శి  గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. 13 జిల్లాల్లోని 16 రెవెన్యూ డివిజన్లు, 161 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 28,995 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, 6,047 సమస్యాత్మక, 4,967 అత్యంత సమస్యాత్మక కేంద్రాలు గుర్తించామని పేర్కొన్నారు. కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాటు చేశామని సెంటర్ల దగ్గర వీడియోలో రికార్డు చేస్తున్నామని ద్వివేది తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఆదివారం నాలుగో విడత పోలింగ్‌ జరగనుంది. ఇందుకు పంచాయతీ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. తుది దశ కూడా ప్రశాంతంగా నిర్వహిస్తామని పోలీస్‌ అధికారులు ధీమాగా ఉన్నారు.

 

నాలుగో విడత గుంటూరు డివిజన్‌ పంచాయతీ ఎన్నికల్లో ప్రలోభాలు పతాక స్థాయికి చేరాయి. గురువారంతో ప్రచారం ముగిసింది. ఆదివారం పోలింగ్‌ నేపథ్యంలో తాయిలాల పంపిణీకి తెరలేపారు. మద్యం, నగదుతో పాటు ప్రత్యేక తాయిలాలు కూడా అందజేసేం దుకు నాయకులు సిద్ధమయ్యారు. మిగిలిన డివిజన్లకు భిన్నంగా ఇక్కడ పలు పంచాయతీల్లో అధికారపార్టీకి ధీటుగా ప్రతిపక్షాలు బలపరిచిన అభ్యర్థులు పోటీలో నిలిచారు. దీంతో ఇక్కడ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారింది. గెలుపుకోసం అభ్యర్థులు మద్యం, డబ్బు, గిఫ్ట్‌లు, పలావు పాకెట్లు పంచుతున్నారు.