వ్యాక్సిన్ వేయించుకున్న ఇమ్రాన్‌ఖాన్‌కు తాజాగా కరోనా

Published: Saturday March 20, 2021

రెండు రోజుల క్రితం కరోనా వ్యాక్సిన్ తొలి డోసు వేయించుకున్న పాకిస్థాన్ ప్రధాని తాజాగా కరోనా బారినపడడం కలకలం రేపుతోంది. ఇమ్రాన్‌ఖాన్‌కు కరోనా వైరస్ సంక్రమించినట్టు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి ఫైసల్ సుల్తాన్ శనివారం వెల్లడించారు. ప్రధాని ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నట్టు తెలిపారు. మరోవైపు, పాకిస్థాన్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్నాయి.

 

శనివారం రికార్డు స్థాయిలో 3,876 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా దేశంలో పాజిటివిటీ రేటు 9.4 శాతానికి చేరుకుంది. తాజా కేసులతో కలుపుకుని దేశంలో ఇప్పటి వరకు మొత్తం 6,23,135 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 40 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,799కి పెరిగింది.  అలాగే, ఇప్పటి వరకు 5,79,760 మంది కరోనా కోరల నుంచి బయటపడ్డారు.  2,122 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యశాఖ అధికారులు తెలిపారు.