ఛత్తీస్‌గఢ్‌లో మావోల దాడి.. 22 మంది మృతి

Published: Sunday April 04, 2021

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. భద్రతా బలగాలపై పక్కా వ్యూహంతో భారీ దాడి చేశారు. బీజాపూర్ అడవుల్లో శనివారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులకు- మావోయిస్టులకు మధ్య భీకర యుద్ధం జరిగింది. ఈ దాడిలో 22 మంది జవాన్లు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇంకా 21 మంది జవాన్ల ఆచూకీ లేకుండా పోయింది. కూబింగ్‌కు వెళ్తున్న 660 మంది జవాన్లపై మావోయిస్టులు లాంచర్లతో దాడి చేశారు.


ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా-బీజాపూర్ సరిహద్దుల్లో భద్రతా దళాలు-మావోయిస్టుల మధ్య శనివారం నుంచి భీకర పోరు జరుగుతోంది. భద్రతా దళాలను మావోయిస్టులు తీవ్రంగా దెబ్బతీసినట్లు తెలుస్తోంది. ఈ ఎన్‌కౌంటర్లో 22 మంది భద్రతా సిబ్బంది, ఒక మహిళా మావోయిస్టు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 21 మంది భద్రతా సిబ్బంది ఆచూకీ తెలియడం లేదు. ఆదివారం 20 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఓ వార్తా సంస్థ వెల్లడించింది. మావోయిస్టుల కోసం కూంబింగ్ జరుగుతోంది.

 

ఆచూకీ లేకుండా పోయిన భద్రతా సిబ్బంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. టర్రెం అటవీ ప్రాంతానికి పెద్ద ఎత్తున అదనపు బలగాలను తరలిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని బీజాపూర్ పోలీసులు చెప్తున్నారు. అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం, గాయపడిన 24 మంది జవాన్లను బీజాపూర్ ఆసుపత్రికి తరలించారు. మరొక ఏడుగురిని రాయ్‌పూర్ ఆసుపత్రికి తరలించారు. 

 

ఇదిలావుండగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్‌కు ఫోన్ చేశారు. బీజాపూర్ జిల్లాలోని టర్రెం సమీపంలో భద్రతా దళాలు, నక్సలైట్ల మధ్య ఎన్‌కౌంటర్ ఘటనపై ఆరా తీశారు. ఈ ఎన్‌కౌంటర్లో ఐదుగురు జవాన్లు అమరులుకావడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్ జరిగిన తర్వాత 21 మంది భద్రతా దళాల సిబ్బంది ఆచూకీ కనిపించడం లేదు. వీరిలో ఏడుగురు సీఆర్‌పీఎఫ్ సిబ్బంది. 

 

అమిత్ షా ఇచ్చిన ఓ ట్వీట్‌లో, ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులతో జరిగిన పోరాటంలో అమరులైన భద్రతా సిబ్బంది ధైర్యసాహసాలకు, త్యాగాలకు శిరసు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు. వీరి పరాక్రమాన్ని దేశ ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని తెలిపారు. అమరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శాంతి, అభివృద్ధిలకు శత్రువులుగా వ్యవహరిస్తున్నవారితో పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్లో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఎన్‌కౌంటర్లో దాదాపు 30 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. 

 

మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లో పరిస్థితిని సమీక్షించాలని అమిత్ షా కేంద్ర రిజర్వు పోలీసు దళం (సీఆర్‌పీఎఫ్) డైరెక్టర్ జనరల్‌‌ కుల్‌దీప్ సింగ్‌ను ఆదేశించారు. వెంటనే కుల్‌దీప్ సింగ్ ఛత్తీస్‌గఢ్ చేరుకుని, భద్రతా దళాల కార్యకలాపాలను సమీక్షించారు.