ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేసిన హైకోర్టు

Published: Friday May 21, 2021

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను హైకోర్టు రద్దు చేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని హైకోర్టు తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ లేదని హైకోర్టు పేర్కొంది. పోలింగ్‌కు 4 వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలన్న నిబంధన పాటించలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. కేవలం వారం వ్యవధిలోనే ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే ఎన్నికలు నిర్వహించామని.. కౌంటింగ్‌కు అనుమతించాలని.. ఏపీ ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లనుంది.

 

 

 

 

కాగా.. పోలింగ్‌ తేదీకి నాలుగు వారాల ముందు కోడ్‌ విధించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ఇచ్చిందని టీడీపీ నేత వర్ల రామయ్య వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. అలాగే జనసేన, బీజేపీ నేతలు సైతం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తొలుత విచారణ జరిపిన హైకోర్టు సింగిల్‌ జడ్జి... ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తూ ఏప్రిల్‌ 6న మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. ఈ క్రమంలోనే ఎన్నికల పోలింగ్‌కు అనుమతించిన డివిజన్ బెంచ్.. ఓట్ల లెక్కింపును చేపట్టవద్దని ఆదేశించింది. పోలింగ్ అనంతరం ఇరుపక్షాల తరుఫున హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో విచారణను పూర్తి చేసిన హైకోర్టు తాజాగా ఎన్నికలను రద్దు చేస్తూ సంచలన తీర్పును వెలువరించింది.