విదేశీ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు షురూ

అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లోని వర్సిటీల్లో ఆగస్టులో ప్రవేశాలు మొదలవుతున్న నేపథ్యంలో టీకాలు, వీసాల అనుమతిపై తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే విదేశాలకు వెళ్లే విద్యార్థులకు కొన్ని విశ్వవిద్యాలయాలు వ్యాక్సినేషన్ తప్పనిసరి అని చెబుతుండటంతో వారికి కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయి. తమ రాష్ట్రం నుంచి విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నాయి. ఈ విషయంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి కార్యాచరణను ప్రకటించలేదు. మన రాష్ట్రం నుంచి ఏటా వేలాది మంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, జర్మనీ తదితర దేశాలకు వెళుతుంటారు. 18-44 ఏళ్ల మధ్య వయసువారికి రాష్ట్రంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ ఊపందుకోకపోవడం.. విదేశీ విశ్వ విద్యాలయాల్లో ప్రవేశాలు మరో రెండు నెలల్లో మొదలుకానున్న నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఈ తరహా విద్యార్థుల కోసం కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాల మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించాలని కోరుతున్నారు.
కరోనా ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళుతున్నవారికి అక్కడి యంత్రాంగం అండగా నిలుస్తోంది. ఇతర ప్రయాణికులకు వ్యాక్సినేషన్ తప్పనిసరి చేసినా, అంతర్జాతీయ విద్యార్థులకు మాత్రం పలు మినహాయింపులతో మద్దతునిస్తున్నాయి. సాధారణంగా ఉన్నతవిద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల్లో ఎక్కువమంది అమెరికా, బ్రిటన్‌కు ప్రాధాన్యమిస్తారు. అంతర్జాతీయ విద్యార్థుల విషయంలో టీకా నిర్ణయాన్ని అమెరికా ప్రభుత్వం అక్కడి విశ్వవిద్యాలయాలకే వదిలేసింది. ఈమేరకు పలు విశ్వవిద్యాలయాలు టీకా తీసుకోని విద్యార్థులు కూడా రావొచ్చునని వెసులుబాటు కల్పించాయి. అయితే అమెరికాలో దిగాక పది రోజుల హోం క్వారంటైన్ తప్పనిసరి అంటున్నాయి. ఇలాంటి విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేదు.
కొన్ని యూనివర్సిటీలు మాత్రం టీకాల విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. అమెరికాలోని ఎఫ్‌డీఏ (ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ) గుర్తించిన టీకాలు వేసుకున్నవారినే అనుమతిస్తున్నాయి. మన దేశంలో ప్రస్తుతం కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు వేస్తుండగా ఈ రెంటినీ ఎఫ్‌డీఏ గుర్తించడం లేదు. అమెరికాలో ప్రముఖ విశ్వవిద్యాలయం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫొర్నియా ఎఫ్‌డీఏ గుర్తించిన టీకాను తప్పనిసరి చేసింది. ఆ టీకాలు వేసుకోని వారిని అనుమతించబోమని స్పష్టం చేసింది. అమెరికాలోని పలు వర్సిటీలు ఇలాంటి నిబంధనలు జారీ చేస్తున్నాయి. ఇంకొన్ని దేశాల్లో డబ్ల్యూహెచ్‌వో గుర్తించిన కొవిషీల్డ్ టీకాను వేసుకున్న వారినే అనుమతిస్తున్నాయి. అయితే ఇప్పటికే టీకాలు వేసుకున్న విద్యార్థులు, ఈ షరతులపై ఆందోళన చెందుతున్నారు. సమస్య తీవ్రతను గుర్తించిన కేంద్రప్రభుత్వం పరిష్కారం దిశగా చర్యలు ప్రారంభించింది. టీకాల పరంగా భారతీయ విద్యార్థులకు మినహాయింపు ఇవ్వాలంటూ వివిధ దేశాలతో చర్చలు జరపనుంది. అటు డబ్ల్యూహెచ్‌వో కూడా ఆగస్టు నాటికి కొవాగ్జిన్‌కు కూడా అనుమతులిచ్చే అవకాశాలు కనిపిస్తుండటంతో విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Share this on your social network: