ఈ మెడిసిన్‌పై ఎందుకింత రచ్చ..!

కరోనా ప్రారంభమైన నాటి నుంచి ఈ వైరస్‌ను నియంత్రించడానికి రకరకాల మెడిసిన్స్ వాడటం జరుగుతోంది. వాటిలో వైరస్ సోకిన రోగులకు ఇంతకాలం డాక్టర్లు ఇస్తున్న ప్రధాన మెడిసిన్ ఐవర్‌మెక్టిన్. అయితే ఇటీవలి కాలంలో దీనికి వ్యతిరేకంగా చాలా ప్రచారం జరుగుతోంది. కరోనా రోగుల ట్రీట్‌మెంట్‌లో ఈ డ్రగ్ వాడవద్దని పలు దేశాలు మొత్తుకుంటున్నాయి. డిక్సామీథాసొన్, రెమడెసివిర్ వంటి వాటి అత్యవసర వినియోగానికి పచ్చజెండా ఊపిన దేశాలు కూడా ఐవర్‌మెక్టిన్ విషయంలో మాత్రం ససేమిరా అనేస్తున్నాయి. మరి ఇంతకాలం డాక్టర్లు కరోనా చికిత్సలో దీన్నే వాడారు కదా. అలాంటప్పుడు ఐవర్‌మెక్టిన్‌పై సడన్‌గా ఇప్పుడే ఎందుకీ రచ్చ?
కరోనా చికిత్సలో పలు మెడిసిన్స్ వాడకానికి అనుమతులు లభించాయి. వాటిలో డిక్సామీథాసోన్, రెమ్‌డెసివిర్ కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం చాలా దేశాల్లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఎక్కడ చూసిన ఈ మెడిసిన్స్ కొరత వైద్యులను ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా పేషెంట్ల చికిత్స మధ్యలో ఆగిపోయేలా చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని కొత్త ఔషధాలవైపు అందరి చూపూ వెళ్లింది. అలాంటి వాటిలో ఒకటి ఐవర్‌మెక్టిన్. 1975లో కనుగొన్న ఈ ఔషధాన్ని 1980లో కమర్షియలైజ్ చేశారు. కొంతమంది ఆస్ట్రేలియా పరిశోధకులు కరోనా వైరస్ శరీరంలో పెరగకుండా నిరోధించడానికి ఐవర్‌మెక్టిన్ బాగా పనిచేస్తుందని కనుగొన్నారు. దీంతో అందరి ఫోకస్ దీనిపై పడింది.
సాధారణంగా జంతువులకు చికిత్స చేయడానికి, ముఖ్యంగా జంతువుల శరీరాల్లో చేరే పరాన్నజీవులను తొలగించడానికి ఐవర్‌మెక్టిన్ ఉపయోగిస్తారు. ఇప్పుడు కరోనా విపరీతంగా ఉన్న స్లొవేకియా, సీజెచ్ రిపబ్లిక్ తదితర ప్రాంతాల్లో కొవిడ్19 చికిత్సలో మనుషులకు కూడా ఐవర్‌మెక్టిన్ వినియోగానికి అనుమతులు లభించాయి. కానీ అగ్రరాజ్యం అమెరికాలోని ఎఫ్‌డీఏ వంటి సంస్థలు కరోనా చికిత్సలో ఐవర్‌మెక్టిన్ వాడకానికి అనుమతి ఇవ్వలేదు. సొంతగా ఐవర్‌మెక్టిన్ ఉపయోగించిన పేషెంట్లు ఆస్పత్రిలో చేరి, మెడికల్ సపోర్ట్ అవసరమైందని ఎఫ్‌డిఏ పేర్కొంది. ఇలాంటి చాలా ఫిర్యాదులు తమకు వచ్చాయని తెలిపింది. అలాగే ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం కరోనా చికిత్సలో ఐవర్‌మెక్టిన్ వినియోగానికి తాము మద్దతివ్వబోమని స్పష్టంచేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా క్లినికల్ ట్రయల్స్ పరిస్థితుల్లో తప్ప సాధారణంగా ఐవర్‌మెక్టిన్ వాడకం తగదని తేల్చేసింది.
ఐవర్‌మెక్టిన్ తయారు చేసే సంస్థ ఎమ్ఎస్‌డి కూడా తమ విశ్లేషణలో కూడా కరోనా చికిత్సలో ఐవర్‌మెక్టిన్ ప్రభావానికి సంబంధించిన ఎటువంటి శాస్త్రీయ ఆధారాలూ కనిపించలేదని తేల్చేసింది. ఈ డ్రగ్ కరోనాను తగ్గిస్తుందనడానికి ఎటువంటి అర్థవంతమైన ఆధారం కనిపించలేదని స్పష్టంగా చెప్పింది. అలాగే ఇది ఆరోగ్య భద్రతపై చూపించే ప్రభావం విషయంలో కూడా ఎటువంటి డేటా లేదని, ఈ పరిస్థితి ఆందోళనకరమని ఎమ్ఎస్‌డీ పేర్కొంది. అయితే కరోనా మహమ్మారి తీవ్రంగా ఉన్న సౌతాఫ్రికా వంటి దేశాలు మాత్రం ఐవర్‌మెక్టిన్ వినియోగం వైపే మొగ్గుచూపుతున్నాయి. ఇక్కడ కరోనా వ్యాక్సినేషన్ ఇంకా దేశం మొత్తంలో అమలు కావడం లేదు. దీంతో కరోనా ఇంకా వ్యాపిస్తూనే ఉంది. సౌతాఫ్రికన్ హెల్త్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ అథారిటీ (ఎస్ఏహెచ్‌పీఆర్ఏ) ఐవర్‌మెక్టిన్ వాడకాన్ని వద్దంటున్న కూడా.. కొందరు డాక్టర్లు మాత్రం కరోనా వైరస్‌ను నియంత్రించడం కోసం ఈ డ్రగ్‌ను ప్రిస్క్రయిబ్ చేస్తున్నారు. దీనివల్ల వైరస్ లక్షణాలు తగ్గే అవకాశాలు ఉన్నాయని వీరు వాదిస్తున్నారు. ఈ దేశంలోని బ్లాక్ మార్కెట్‌లో కూడా ఐవర్‌మెక్టిన్ బాగా అమ్ముడుపోతోంది. ఒక్క ట్యాబ్లెట్ కొనాలంటేనే 25 యూరోలు(సుమారు రూ.2,225) ధర పలుకుతోంది.

Share this on your social network: