కలెక్షన్‌లు తగ్గకూడదంటూ కండక్టర్లపై ఒత్తిళ్లు

ఆసియాలోనే అతిపెద్ద రవాణా సంస్థగా పేరొందిన ఏపీఎ్‌సఆర్టీసీ కష్టాల్లో కూరుకుపోతోంది. రాష్ట్రంలోని కోట్లాది మంది సామాన్య, మధ్య తరగతి ప్రజలకు రోజూ 11 వేల బస్సులతో ఆర్టీసీ ప్రయాణ అవసరాలు తీరుస్తోంది. 13 జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలకు సైతం బస్సులు నడుపుతోన్న ఈ సంస్థకు నిర్వహణ భారం, ప్రభుత్వ పన్నులు, డీజిల్ ధరల పెరుగుదల ప్రధాన కష్టాలుగా మారాయి. ఆపరేషన్స్ విభాగం ఎంత జాగ్రత్తగా బస్సులు నడిపినా, ఇంజనీరింగ్ విభాగం పొదుపు చేసినా ఏటా ఆరేడు వందల కోట్ల రూపాయల నష్టాలను చవిచూస్తూనే ఉంది. గత ఏడాది జూలైలో రూ.80లోపు ఉన్న డీజిల్ ధరలు ఇప్పుడు రూ.వంద దాటేశాయి. రోజుకు 45లక్షల కిలోమీటర్లు ప్రయాణించే బస్సుల కోసం ఆర్టీసీ ఏటా దాదాపు 30కోట్ల లీటర్ల వరకూ డీజిల్ కొనుగోలు చేస్తుంది. లీటరుపై ఏడాదిలోనే రూ.22వరకూ పెరగడంతో సంస్థపై రూ.600కోట్లకు పైగా భారం పడుతోంది. వీటికి తోడు స్పేర్ పార్ట్‌ల ఖరీదు కూడా ఏటా పెరుగుతుండటం, కొవిడ్ ప్రభావంతో ఆక్యుపెన్సీ బాగా తగ్గిపోవడం ఆర్టీసీని కుంగదీస్తున్నాయి. వాటినుంచి గట్టెక్కేందుకు యాజమాన్యం తీసుకొంటున్న చర్యలు సిబ్బందికి చుక్కలు చూపిస్తున్నాయి.
ఒక బస్సు కి.మీ. దూరం ప్రయాణిస్తే అయ్యే ఖర్చు సరాసరి రూ.45 ఉంటుంది. డీజిల్ ధరలు, బస్సు నిర్వహణ, సిబ్బంది జీతాలు లెక్కించిన యాజమాన్యం ప్రతి సర్వీసుకు నిర్దిష్ట కలెక్షన్‌ను నిర్ణయిస్తుంది. మంగళవారం, శుక్రవారం మినహా ఇతర రోజుల్లో కలెక్షన్ తగ్గడానికి వీల్లేదని అధికారులు ఆదేశిస్తుంటారు. కలెక్షన్ తగ్గితే ట్రాన్స్‌ఫర్ చేస్తామని, డ్యూటీలు రెగ్యులర్‌గా ఇవ్వబోమని కండక్టర్లపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు.
బస్సు ఏ సమయానికి బయటికి తీశారు... ఏ టైముకు గమ్యం చేరారన్నది అనవసరం. డీజిల్ ఎంత పొదుపు చేశారన్నదే ముఖ్యం అంటూ అధికారులు వేధిస్తున్నారు. కేఎంపీఎల్ రాకపోతే ఎంత సురక్షితంగా బస్సు నడిపినా ఉపయోగం లేదంటున్నారు.
గ్యారేజీల్లో బస్సుల నిర్వహణ చూసే మెకానిక్‌ల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. బస్సుల్లో 50శాతానికి పైగా గడువు తీరినవే. ఎప్పుడూ ఏదో ఒక మరమ్మతు వస్తూనే ఉంటుంది. వాటికి స్పేర్ పార్ట్‌లు అడిగితే ఇంత ఇండెంట్ ఎందుకంటూ అధికారులు కోత విధిస్తారు. దారిలో ఎక్కడైనా బస్సు ఆగిపోతే పనిష్మెంట్ తప్పదు. పొదుపు పేరుతో గ్యారేజీల్లో సిబ్బందిని సైతం యాజమాన్యం తగ్గించింది. ఆర్టీసీలో గతంలో ఎన్నడూ లేనివిధంగా రాజకీయ జోక్యం ఎక్కువైందని సిబ్బంది, అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కార్మిక చట్టాలు వర్తించకపోవడంతో ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదంటున్నారు.
సిబ్బందిని విలీనం చేసుకున్న ప్రభుత్వం సంస్థను గాడిలో పెడితేనే మనుగడ ఉంటుందని అధికారులు, సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. ఆర్టీసీ ఆక్యుపెన్సీపై దెబ్బకొడుతున్న అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడం, పెరుగుతున్న డీజిల్ ధరలకు అనుగుణంగా టికెట్ ధరలు పెంపునకు అనుమతి ఇవ్వడం, పల్లెవెలుగుల్లాంటి నష్ట సర్వీసులపై ఎంవీ టాక్స్ రద్దు చేయడం లాంటి చర్యలు తీసుకుంటే ఆర్టీసీ మనుగడ సాగిస్తుందని, లేదంటే కష్టమేనని అంటున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ దెబ్బతింటే 52వేల కుటుంబాలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనితోపాటు కోట్లాది మంది సామాన్య ప్రయాణికులపై ప్రైవేటు రవాణా భారం పడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Share this on your social network: