రైతుల మహాపాదయాత్రలో లాఠీఛార్జ్.

Published: Thursday November 11, 2021

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడ జరుగుతున్న రాజధాని రైతుల మహాపాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైతులు చేస్తున్న పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న స్థానికులను పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. అయినప్పటికీ పోలీసులు అడ్డుపెట్టిన తాళ్లను నెట్టుకుని మరీ స్థానికులు ముందుకు వచ్చారు. అమరావతి రైతులకు సంఘీభావం ప్రకటించేందుకు వస్తే అడ్డుకోవడానికి మీరెవరంటూ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. పోలీసులను నెట్టుకుంటూ ముందుకు వెళ్లి మరీ రైతులకు స్థానికులు సంఘీభావం తెలిపారు. చదలవాడ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పోలీసుల లాఠీఛార్జ్‌లో పలువురు గాయపడినట్లు సమాచారం. 

 

కాగా.... ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడులో రాజధాని రైతుల మహాపాదయాత్ర 11వ రోజుకు చేరుకుంది. ఈ రోజు ఉదయం పాదయాత్ర శిబిరం వద్దకు చేరుకున్న జిల్లా పోలీస్ యంత్రాంగం... ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నందున ఇతరులు పాదయాత్రలో  పాల్గొన కూడదని ఆదేశాలు జారీ చేశారు. రాజధాని ప్రాంతానికి చెందిన 157 మంది రైతులు మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలని పోలీసులు తెలిపారు. ఈ మేరకు అమరావతి జేఏసీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కాగా పోలీసుల నోటీసులపై జేఏసీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీలకతీతంగా సాగుతున్న యాత్రకు తమకు నోటీసులు ఎలా ఇస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. పార్టీలకు సంబంధించిన వారికి నోటీసులు ఇవ్వకుండా తమకు నోటీసు ఇవ్వడమేంటని జేఏసీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.