సిమెంటు మంట బస్తా ధర రూ.30 పెంపు

భారతి, అల్ర్టాటెక్ సిమెంటు రూ.380
ఇతర కంపెనీల ధరలూ రూ.300-350
ఇప్పటికే ఆకాశంలో ఇంటి సామగ్రి
మూడింతలు పెరిగిన ఇసుక ధర
ప్రభుత్వ నియంత్రణలోనివన్నీ పెంపు
వీటికి తోడు అడ్డగోలు పన్నుల మోత
సామాన్యుడు ఇల్లు కట్టాలంటే చుక్కలే
కొత్త వెంచర్లకు రియల్టర్లు, బిల్డర్లు దూరం
పనుల్లేక రోడ్డునపడ్డ 30 లక్షల మంది
ఇసుక, ఇటుక, స్టీల్, పెయింట్స్.. ఇలా ఇంటి నిర్మాణ సామగ్రి ధరలు ఇప్పటికే ఆకాశాన్నంటాయి. ఇప్పుడు సిమెంట్ ధరలనూ పెంచేశారు. మూడేళ్లక్రితంతో పోలిస్తే ఇంటి నిర్మాణ బడ్జెట్ 50ు పెరిగిపోయింది. దీనికితోడు పన్నుల బాదుడు భారమైపోయింది. ప్రభుత్వం నిర్ణయించేవి, ప్రభుత్వమే నియంత్రించగలిగిన వస్తువుల ధరలన్నీ పెరిగిపోయాయి. దీంతో సామాన్యుడి సొంతింటి కల కలగానే మిగిలిపోతోంది. రియల్టర్లు, బిల్డర్లు కొత్త వెంచర్లంటేనే ‘మా కొద్దు బాబోయ్’ అనే పరిస్థితి. వెరసి.. పనుల్లేక ఈ రంగంపై ఆధారపడ్డ 30 లక్షల మంది దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
సిమెంటు ధరలు మళ్లీ పెంచేశారు. బస్తాకు రూ.30 చొప్పున పెంచారు. భారతి, అల్ర్టాటెక్ లాంటి కంపెనీల సిమెంటు బస్తా ధర రూ.380కి చేరుకుంది. ఇతర కంపెనీల ధరలూ రూ.300-350కి చేరాయి. ఇప్పటికే స్టీల్, ఇసుక, ఇటుక, హార్డ్‌వేర్ పరికరాలు, పెయింట్స్ ధరలు ఆకాశాన్ని తాకాయి. ఇసుక ధర ఏకంగా మూడింతలైంది. ఇంతకుముందు ఇటుక ఒక్కోటి రూ.5 ఉండేది. ఇప్పుడు 60 శాతం పెరగడంతో రూ.8కి చేరింది. ఇక స్టీల్ అయితే రికార్డు స్థాయిలో టన్ను రూ.47 వేల నుంచి రూ.65 వేలకు పెరిగింది. హార్డ్‌వేర్, టాయ్‌లెట్స్ సామాన్లు 20 శాతం పైనే పెరిగాయి. వైర్ల ధరలు బీభత్సంగా పెరగడంతో విద్యుత్ కనెక్షన్ ఇవ్వకుండానే షాక్ కొడుతున్నాయి. వెరసి.. ఎవరైనా ఇళ్లు కట్టుకోవాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. ‘ఇళ్లు కట్టి చూడు’.. అన్నది అసాధ్యమేమో అన్నంత స్థాయికి ఈ ధరలు పెరిగిపోయాయి. నిర్మాణాలు మొదలుపెట్టిన వాళ్లు మధ్యలో మానేయలేక, బడ్జెట్ దాటి అప్పులపాలు కావాల్సిన పరిస్థితి తలెత్తింది. కొత్త ఇళ్లు మొదలుపెట్టాలనుకునేవారు పునరాలోచన చేయాల్సిన పరిస్థితి. రియల్టర్లు, బిల్డర్లు అయితే కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టేందుకు సాహసించడం లేదు.
పన్నుల పోటుతో మరింత భారం
పెరిగిన రేట్లకు తోడు పన్నుల బాదుడు మరింత భారమవుతోంది. ఆదాయపు పన్ను, జీఎ్‌సటీ గూబ గుయ్యిమనిపిస్తున్నాయి. జీఎ్‌సటీ 12 శాతం వేస్తున్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ తీసేసినా ఐదుశాతం వరకు చెల్లించాల్సి వస్తోంది. మరోవైపు వర్క్ ఆర్డర్ మీద అయితే 18 శాతం జీఎ్‌సటీ అంటున్నారు. గతంలో లేనివిధంగా ఇప్పుడు స్థల యజమానికి వచ్చిన ఫ్లాట్ల మీద కూడా జీఎ్‌సటీ కట్టాలంటున్నారు. అంటే ఒక స్థలం యజమాని దగ్గరి నుంచి ఫ్లాట్ల నిర్మాణం కోసం బిల్డర్ డెవల్‌పమెంట్‌కు తీసుకుంటే.. ఆ సమయంలో అగ్రిమెంటు రిజిస్ర్టేషన్ చార్జీలు, ఆ తర్వాత జీఎ్‌సటీ 12 శాతం (ఇన్‌పుట్‌తో కలిపి), ఆ తర్వాత ఆదాయపు పన్ను, మరోవైపు స్థల యజమానిపై ఆదాయపు పన్ను, అతని వాటాకు వచ్చిన ఫ్లాట్లపై జీఎ్‌సటీ, ఇంకోవైపు కస్టమర్‌కు రిజిస్ర్టేషన్ పన్ను, కొంతమేర జీఎస్టీ.. ఇలా మొత్తం అన్ని వైపుల నుంచి, అన్ని దశల్లో పన్నులు లాగేస్తున్నారు. దీంతో పెరిగిన ధరలు, మరోవైపు పన్నుల మోతతో కొత్త వెంచర్లు ప్రారంభించేవారు బాగా తగ్గిపోయారు.
50 శాతం పెరిగిన ‘ఇంటి’ బడ్జెట్
సిమెంటు, స్టీల్, ఇతర నిర్మాణ వస్తువుల ధరలు, పన్నులు పెరిగిపోవడంలో ఇల్లు కట్టుకునేవారి బడ్జెట్ 50 శాతం పెరిగిపోయింది. 2019 నాటికి ఇప్పటికి పోల్చి చూస్తే ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. అప్పట్లో రూ.10 లక్షలు పెట్టి కట్టుకునే ఇంటికి ఇప్పుడు రూ.15 లక్షలు పెట్టాల్సి వస్తోంది. అప్పట్లో రూ.40 లక్షలకు పూర్తయ్యే ఇంటికి ఇప్పుడు రూ.60 లక్షల వరకు ఖర్చవుతోంది. ప్రజల ఆదాయాలు పెరగలేదు కానీ నిర్మాణ వ్యయం దారుణంగా పెరిగిపోయింది. దీంతో సొంతిళ్లు సమకూర్చుకుందామనుకునే వారు దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. ఏదో ఒక వస్తువు రేటు పెరిగితే భరించవచ్చు కానీ అన్ని వస్తువుల ధరలు పెరిగిపోవడం అన్నది సొంతిళ్లు కట్టుకోవాలనుకున్న వారి కలల్ని చిదిమేస్తోంది.
ప్రభుత్వం నిర్ణయించే వస్తువుల ధరలు, ప్రభుత్వమే నియంత్రించగలిగిన వస్తువుల ధరలు అన్నీ పెరిగిపోయాయి. ప్రభుత్వం చేతిలో ఉన్న ఇసుక ధర మూడింతలు పెరిగిపోయింది. ఈ విషయం ఎక్కడ అడిగినా స్పష్టంగా చెబుతున్నారు. ఉచితంగా ఇచ్చే ఇసుకకు ప్రభుత్వమే రేటు నిర్ణయించి ధర వసూలు చేస్తోంది. ప్రజలకు ఇసుక చేరేసరికి ఈ భారం మరింత పెరిగిపోతోంది. ఇసుక సరఫరాలో లోపాలు అరికడతామన్న ప్రభుత్వం చివరకు ధర తగ్గించకపోగా మూడింతలు పెరిగేందుకు కారణమైంది. ఒక కాంట్రాక్టరుకు ఇచ్చేసి ఏటా దాదాపు రూ.700 కోట్లు తీసుకుంటోంది. మరోవైపు ప్రభుత్వం నియంత్రించగలిగిన సిమెంటు, స్టీల్ తదితర వస్తువుల ధరలు కూడా తగ్గించే దిశగా చర్యలు తీసుకోలేదు. సిమెంటు కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వమే భూమి, విద్యుత్, నీరు, ఆఖరికి సిమెంటు తయారీకి అతి కీలకమైన సున్నపురాయి గనులను కేటాయిస్తుంది. ఇవన్నీ ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు వాటి ధరను నియంత్రించే శక్తి కూడా ఉంటుంది. అయితే ధరలు తగ్గించడం మాని.. చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయికి ధరలు వెళ్లిపోయినా చేసిందేమీలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
సొంతిళ్లు కట్టుకునేవారు, బిల్డర్లు పెరిగిన ధరలు, పన్నుల బాదుడుతో నిర్మాణాలు చేపట్టే బదులు ఊరికే ఉండటం మేలు అనే పరిస్థితికి వచ్చేశారు. దీంతో ఈ రంగంపై ఆధారపడిన మేస్త్రీలు, కూలీలు, కార్పెంటర్లు, పెయింటర్లు, టైల్స్ లేయింగ్ వాళ్లు, సెంట్రింగ్ పనివారు, గ్రానైట్ లేయింగ్ పనివారు, ప్లంబర్లు, ఎలక్ర్టీషియన్లకు పనిలేకుండా పోయే దుస్థితి ఏర్పడింది. ఎంత దారుణంగా అంటే.. ఒకప్పుడు పదిమంది కూలీలకు మేస్ర్తీగా ఉండి పనులు చక్కబెట్టిన వాళ్లు ఇప్పుడు పండక్కి పిల్లలకు బట్టలు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఏదైనా కొత్తింటి నిర్మాణం ప్రారంభమవుతుందా? కొత్త వెంచర్ ప్రారంభిస్తారా? అంటూ తమకు తెలిసిన వారిని ఆరా తీస్తున్నారు. నిర్మాణం ప్రారంభించినప్పుడు పనిచేస్తాం.. ఇప్పుడు ఒక రెండువేలు ఉంటే ఇవ్వండని అడిగే దీనస్థితికి చేరుకున్నారు. నిర్మాణ రంగంపై ఆధారపడిన సుమారు 30 లక్షల మందిదీ ఇదే పరిస్థితి. ధరలు, పన్నుల పోటుతో నిర్మాణాలు ప్రారంభం కాకపోవడంతో, తమ బతుకుల్ని చిధ్రం చేసిన వైనాన్ని తలుచుకుంటూ, అప్పులపై ఆధారపడుతూ జీవన పోరాటం సాగిస్తున్నారు.

Share this on your social network: