5 రాష్ట్రాలకు 7 విడతల్లో పోలింగ్

Published: Saturday January 08, 2022

 ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ శాసన సభ ఎన్నికల షెడ్యూలును ఎన్నికల కమిషన్ ప్రకటించింది. 2024లో జరిగే లోక్‌సభ సాధారణ ఎన్నికల కోసం ప్రజల నాడిని తెలుసుకోవడానికి  ఈ శాసన సభల ఎన్నికల ఫలితాలు ఉపయోగపడతాయి. ఉత్తర ప్రదేశ్‌లో 403, ఉత్తరాఖండ్‌లో 70, పంజాబ్‌లో 117, గోవాలో 40, మణిపూర్‌లో 60  శాసన సభ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం పంజాబ్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాలు ఉన్నాయి. పంజాబ్‌లో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఉంది. కోవిడ్-19 మహమ్మారి పరిస్థితులను సమీక్షించిన అనంతరం ఎన్నికల కమిషన్ ఈ రాష్ట్రాల్లో ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ఎన్నికలను మినీ జాతీయ ఎన్నికలుగా అభివర్ణిస్తున్నారు. 

 

 

5 రాష్ట్రాలకు 7 విడతల్లో ఎన్నికలు

విడత రాష్ట్రాలు పోలింగ్ తేదీ
1.  ఉత్తరప్రదేశ్ ఫిబ్రవరి 10
2.  ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా ఫిబ్రవరి 14
3. ఉత్తరప్రదేశ్ ఫిబ్రవరి 20
4.  ఉత్తరప్రదేశ్ ఫిబ్రవరి 23
5.  ఉత్తరప్రదేశ్, మణిపూర్ ఫిబ్రవరి 27
6.  ఉత్తరప్రదేశ్, మణిపూర్ మార్చి 3
7.  ఉత్తరప్రదేశ్ మార్చి 7
ఫలితాలు ఐదు రాష్ట్రాలు మార్చి 10

 

 

 

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ,  ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ శాసన సభ ఎన్నికల తేదీలను ప్రకటించారు. మొత్తం ఏడు దశల్లో ఈ ఎన్నికలు జరుగుతాయని, ఉత్తర ప్రదేశ్‌లో తొలి దశ పోలింగ్ ఫిబ్రవరి 10న జరుగుతుందని తెలిపారు. రెండో దశ పోలింగ్ ఫిబ్రవరి 14న, మూడో దశ పోలింగ్ ఫిబ్రవరి 20న, నాలుగో దశ పోలింగ్ ఫిబ్రవరి 23న, ఐదో దశ పోలింగ్ ఫిబ్రవరి 27న, ఆరో దశ పోలింగ్ మార్చి 3న, ఏడో దశ పోలింగ్ మార్చి 7న జరుగుతుందని చెప్పారు. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుందని తెలిపారు.

 

పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాలలో పోలింగ్ ఫిబ్రవరి 14న జరుగుతుందని తెలిపారు. మణిపూర్‌లో పోలింగ్ ఫిబ్రవరి 27, మార్చి 3 తేదీల్లో రెండు దశల్లో జరుగుతుందని వివరించారు. ఎన్నికల షెడ్యూలు క్రింది విధంగా ఉంది.

 

ఉత్తర ప్రదేశ్ తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 14న జారీ అవుతుంది. అభ్యర్థులు జనవరి 21 వరకు నామినేషన్లను దాఖలు చేయవచ్చు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జనవరి 27. కాగా పోలింగ్ ఫిబ్రవరి 10న జరుగుతుంది. 

 

ఫిబ్రవరి 14న ఉత్తర ప్రదేశ్‌లో రెండో దశ, గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్‌లలో పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ జనవరి 21న జారీ అవుతుంది. అభ్యర్థులు జనవరి 28 వరకు నామినేషన్లను దాఖలు చేయవచ్చు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జనవరి 31. 

 

ఉత్తర ప్రదేశ్ మూడో దశ ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 25న జారీ అవుతుంది, ఫిబ్రవరి 1 వరకు నామినేషన్లను దాఖలు చేయవచ్చు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఫిబ్రవరి 4. కాగా పోలింగ్ ఫిబ్రవరి 20న జరుగుతుంది. 

 

ఉత్తర ప్రదేశ్ నాలుగో దశ ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 27న జారీ అవుతుంది, అభ్యర్థులు తమ నామినేషన్లను ఫిబ్రవరి 3 వరకు దాఖలు చేయవచ్చు. నామినేషన్ల పరిశీలన ఫిబ్రవరి 4న జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఫిబ్రవరి 7. కాగా పోలింగ్ ఫిబ్రవరి 23న జరుగుతుంది. 

 

ఉత్తర ప్రదేశ్ ఐదో దశ, మణిపూర్ మొదటి దశ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 1న జారీ అవుతుంది. ఫిబ్రవరి 8 వరకు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయవచ్చు. వీటి పరిశీలన ఫిబ్రవరి 9న జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఫిబ్రవరి 11. కాగా పోలింగ్ ఫిబ్రవరి 27న జరుగుతుంది. 

 

ఉత్తర ప్రదేశ్ ఆరో దశ, మణిపూర్ రెండో దశ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 4న విడుదలవుతుంది. ఫిబ్రవరి 11 వరకు నామినేషన్లను దాఖలు చేయవచ్చు, వీటి పరిశీలన ఫిబ్రవరి 14న జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఫిబ్రవరి 16, కాగా పోలింగ్ తేదీ మార్చి 3. 

 

ఫిబ్రవరి 10న ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల ఏడో దశ నోటిఫికేషన్ విడుదలవుతుంది. అభ్యర్థులు ఫిబ్రవరి 17 వరకు నామినేషన్లను దాఖలు చేయవచ్చు. వీటి పరిశీలన ఫిబ్రవరి 18న జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 21 వరకు గడువు ఉంది. పోలింగ్ మార్చి 7న జరుగుతుంది. 

 

ఇదిలావుండగా, పోలింగ్ శాతాన్ని పెంచాలనే ఉద్దేశంతో పోలింగ్ సమయాన్ని అదనంగా ఓ గంట పొడిగించినట్లు సీఈసీ సుశీల్ చంద్ర తెలిపారు. 

 

 

కోవిడ్-19 మహమ్మారి వల్ల ఎన్నికల నిర్వహణ భారీ సవాలుగా నిలుస్తోందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ ఎన్నికలను కోవిడ్ రహిత ఎన్నికలుగా నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ ఐదు రాష్ట్రాల్లోని 690 నియోజకవర్గాల్లో కోవిడ్ రహిత, సురక్షిత ఎన్నికలను నిర్వహించడమే తమ లక్ష్యమని తెలిపారు. వైద్య, ఆరోగ్య శాఖాధికారులతో చర్చించినట్లు తెలిపారు. 

 

ఈ ఎన్నికల్లో 18.34 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, వీరిలో తొలిసారి ఓటు వేయబోతున్నవారు 24.9 లక్షల మంది అని తెలిపారు. 11.4 లక్షల మంది మహిళలు తొలిసారి ఓటు వేయబోతున్నట్లుతెలిపారు. 

 

16 శాతం పోలింగ్ కేంద్రాలను పెంచుతున్నట్లు చెప్పారు. మొత్తం పోలింగ్ బూత్‌ల సంఖ్య 2.16 లక్షలు అని తెలిపారు. ఒక్కొక్క పోలింగ్ బూత్‌కు ఓటర్ల సంఖ్యను 1,250కి తగ్గించినట్లు చెప్పారు. 

 

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో కూడా నామినేషన్లను దాఖలు చేయవచ్చునని తెలిపారు. 

 

కోవిడ్ పాజిటివ్ ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఓటు వేయవచ్చునని తెలిపారు