అతిపెద్ద ఉక్కు కర్మాగారాన్ని ధ్వంసం చేసిన రష్యా

Published: Sunday March 20, 2022

ఉక్రెయిన్‌పై దాడి తీవ్రతను రష్యా రోజురోజుకు మరింత పెంచుతోంది. రష్యా బలగాల దాడిలో తాజాగా ఐరోపాలోనే అత్యంత పెద్దదైన ఉక్కు కర్మాగారం దారుణంగా దెబ్బతింది. ఉక్రెయిన్ పోర్టు సిటీ అయిన మరియుపోల్‌ను రష్యా సేనలు ముట్టడించాయి. అతి పెద్ద ఉక్కు ఫ్యాక్టరీ అయిన అజోవ్‌స్టాల్‌‌పై రష్యా సేనలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ ఘటనలో ఫ్యాక్టరీ తీవ్రంగా దెబ్బతిన్నట్టు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ చట్ట సభ్యురాలు లెసియా వసిలెంకో ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. యూరప్‌లోనే అతిపెద్ద మెటలర్జిక్ ప్లాంట్లలో ఒకటి ధ్వంసమైందని, ఉక్రేనియన్లకు ఇది అతిపెద్ద ఆర్థిక  నష్టమని పేర్కొన్నారు. పర్యావరణం కూడా దారుణంగా దెబ్బతిందని లెసియో ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

దాడి కారణంగా పేలిపోతున్న ఫ్యాక్టరీ వీడియోను లెసియా పోస్టు చేశారు. ఈ ఘటనపై అజోవ్‌స్టాల్ డైరెక్టర్ జనరల్ ఎన్వెర్ టిస్కిష్‌విలి ‘టెలిగ్రామ్’ యాప్ ద్వారా స్పందించారు. త్వరలోనే నగరానికి చేరుకుని కర్మాగారాన్ని తిరిగి నిర్మిస్తామన్నారు. అయితే, ఎంతనష్టం వాటిల్లిందన్న వివరాలు వెల్లడించలేదు. రష్యా దురాక్రమణ ప్రారంభమైనప్పుడే పర్యావరణ నష్టం పెద్దగా జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు చెప్పారు. మెటిన్‌వెస్ట్ గ్రూపులో భాగమైన అజోవ్‌స్టాల్‌ను ఉక్రెయిన్ సంపన్నుడు రినాట్ అఖ్‌మెటోవ్ నియంత్రణలో ఉంది.