అసమ్మతి నేతల బుజ్జగింపునకు రంగంలోకి సీఎం

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సెగ సీఎం జగన్‌కు గట్టిగా తాకినట్లు కనిపిస్తోంది. పదవులు రానివారి అలకలు, విమర్శలు.. అనుచరుల ఆందోళనలు, రాజీనామాలపై ఆయన అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. నాయకత్వాన్ని ధిక్కరించేంతగా అసమ్మతి రేగుతుందని ఆయన ఊహించనేలేదు. విధేయులుగా ఉన్నవారే తిరగబడడం విస్మయం కలిగిస్తోంది. ముఖ్యంగా తన సొంత కుటుంబానికి చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డ్డి రాజీనామా హెచ్చరిక చేయడం జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రాయబారాలు ఫలించకపోవడంతో నేరు గా జగనే రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. బాలినేని చివరకు మెత్తబడినా.. ఈ వ్యవహారంతో పార్టీ ప్రతిష్ఠ దెబ్బతిన్నదని వైసీపీ వర్గాలే అంటున్నాయి. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యే మేకతోటి సుచరితకు హోంమంత్రి పదవి ఇచ్చామని ముఖ్యమంత్రి పదేపదే చెప్పుకొనేవారు. ఈ దఫా కూడా ఎస్సీ ఎమ్మెల్యే తానేటి వనితకు ఆ పదవి కట్టబెట్టినా.. తనను అత్యంత అవమానకరమైన రీతిలో పదవి నుంచి తొలగించారని సుచరిత ఆవేదన వ్యక్తంచేయడం, ఏకంగా శాసనసభ్యత్వానికే రాజీనామా చేయడం దానిని మరుగుపరచింది. పైగా స్పీకర్ ఫార్మాట్‌లో తన రాజీనామా లేఖను ఆమె ఎంపీ మోపిదేవి ద్వారా సీఎంకు పంపారు.
ఇలాంటి అనూహ్య ఘటనల నడుమ సోమవారం మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఇది జరుగుతున్నంత సేపూ జగన్ అన్యమనస్కంగానే ఉన్నారు. ముఖంలో చిరునవ్వు కనిపించలేదు. ఇంటి మనిషి బాలినేనిపై పెట్టిన శ్రద్ధ ఇతర అసంతృప్త నేతలపై ఆయన పెట్టలేదు. సామినేని ఉదయభాను, మేకతోటి సుచరిత, కొలుసు పార్థసారథిలను బుజ్జగించే బాధ్యతను ఆయన రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావుకు అప్పగించారు. ఆయన ప్రయత్నాలు ఫలించకపోవడం జగన్‌ను అసహనానికి గురిచేసిందని అంటున్నారు. అన్నిటికీ మించి తొలిసారి జగన్మోహన్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఎమ్మెల్యేలు బాహాటంగా మాట్లాడే స్థాయికి చేరుకోవడంతో.. పరిస్థితి అదుపు తప్పిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతర్గతంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి ఒక్కసారిగా జ్వాలగా ఎగసిపడడంతో.. సీఎం స్వయంగా జోక్యం చేసుకున్నారు. మంత్రి పదవి ఖాయమనుకున్న కోన రఘుపతికి.. ఉన్న డిప్యూటీ స్పీకర్ పదవి కూడా తీసేసిన సంగతి తెలిసిందే. జగన్ నేరుగా ఆయనతో మాట్లాడారు. పదవిని ఎందుకు తీసేయాల్సి వచ్చిందో వివరించారు. పార్టీ కోసం పనిచేయాలని కోరడంతో రఘుపతి శాంతించినట్లు తెలిసింది.అసంతుష్టులైన సీనియర్ నేతలందరితోనూ మాట్లాడాలని.. రోజూ కొంతమందిని ఫోన్లో పలుకరించాలన్న యోచనలో సీఎం ఉన్నారని సీఎంవో వర్గాలు తెలిపాయి.
ప్రమాణస్వీకార కార్యక్రమానికి తాజా మాజీ మంత్రులు పేర్ని నాని, ధర్మాన కృష్ణదాస్, ఆళ్ల నాని, కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావు, శంకరనారాయణ, కురసాల కన్నబాబు వచ్చినా వారి ముఖాల్లో కళాకాంతుల్లేవు. అంటీముట్టనట్లు వ్యవహరించారు. సుచరిత, బాలినేని శ్రీనివాసరెడ్డి, శ్రీరంగనాథరాజు, పి.అనిల్‌కుమార్ గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యేల హాజరు కూడా బాగా తక్కువగా ఉండడం.. కొత్త మంత్రుల అనుచరుల సందడి పెద్దగా లేకపోవడంతో.. కార్యక్రమం చప్పగా సాగింది. మరోవైపు.. మాజీ మంత్రులను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు జగన్ దగ్గరుండి పరిచయం చేశారు.

Share this on your social network: