జగన్‌ ప్రశ్నించడమే మానుకున్నారు

Published: Saturday July 28, 2018

ప్రజల కోసం పోరాడే వారు, ప్రజల వాణిని వినిపించే వారు ప్రస్తుతం అసెంబ్లీలో ఎవరూ లేరని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, మధు అన్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికార బీజేపీ, టీడీపీలు పేదలను మరచి ధనవంతులకే కొమ్ముకాస్తున్నాయని విమర్శించారు. శుక్రవారం నెల్లూరులోని శ్రీ వెంకటేశ్వర కస్తూర్బా కళాక్షేత్రంలో రాష్ట్ర వ్యవసాయ కార్మికుల సదస్సు జరిగింది. సదస్సులో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారు మాట్లాడుతూ, పేదలకు అన్యాయం జరుగుతున్నా... వైసీపీ అధినేత జగన్‌ ప్రభుత్వాలను ప్రశ్నించడమే మానుకున్నారన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ, వైసీపీ.. అన్నీ ఒకేతాను ముక్కలని ఎద్దేవా చేశారు. పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమం కోసం నూతన రాజకీయ ప్రత్యామ్నాయ విధానం రూపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం 13 జిల్లాల్లో ఒక్కొక్క రంగానికి చెందిన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. వామపక్ష భావాలు కలిగిన అన్ని పార్టీలు, జనసేనతో కలిపి ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. వరుసగా వివిధ జిల్లాల్లో నిర్వహిస్తున్న సదస్సుల వివరాలను, భవిష్యత్‌ కార్యాచరణను వారు సభలో ప్రకటించారు.