గరిష్ఠ మట్టానికి 10 అడుగులే తక్కువ

Published: Friday August 17, 2018

శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా చేరుతోంది. జూరాల, తుంగభద్ర జలాశయాల నుంచి గురువారం సాయంత్రం 3,01,570 క్యూసెక్కుల నీరు చేరుతోంది. వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే ఒకటిరెండు రోజుల్లో శ్రీశైలం గేట్లు ఎత్తి దిగువనున్న నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేసే అవకాశం ఉందని డ్యాం ఇంజనీర్లు తెలిపారు. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా, గురువారం సాయంత్రం 874.90 అడుగులకు చేరింది. అలాగే, నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలకు గాను, 163.20 టీఎంసీల నీరు డ్యాంలో ఉంది. జూరాల నుంచి 1,22,858 క్యూసెక్కులు, సుంకేసుల(తుంగభద్ర నది) నుంచి 1,78,712 క్యూసెక్కులు శ్రీశైలానికి చేరుతోంది. తుంగభద్ర జలాశయానికి ఎగువ నుంచి 2,09,319 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 33 గేట్లు ఎత్తి 2,34,021 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. నదీతీర గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఒడిశా, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాల్లో కుండ పోత వర్షాలు కురుస్తుండటంతో తూర్పు గోదావరి జిల్లా చింతూరువద్ద శబరి నీటి మట్టం 37 అడుగులకు చేరింది. వాగులు, వంకలు పొంగి పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వీఆర్‌పురం వద్ద జాతీయరహదారిపై నీరు నిలవడంతో వాహనాలు నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం శుక్రవారం ఉదయానికి 43 అడుగులకు చేరే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి నదులు ఉగ్రరూపం దాల్చాయి. వంశధార వరద పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాల్లో 4వేల ఎకరాల్లోని పంట ముంపునకు గురయిం ది. భామిని మండలంలో పంట చేలల్లో ఇసుక మేటలు వేశాయి. సీతంపేట మండలం పరిధిలోని కారెంబొంబడుగూడ - ఘాటీగుమడ మలుపు వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి.