బయటపడుతున్న ‘అంగన్‌వాడీ’ బాగోతం

Published: Friday October 12, 2018

‘చిన్నారులకు పెట్టాల్సిన గుడ్లు మింగేస్తున్నారు. పేద పిల్లలకు ఇవ్వాల్సిన పాలు తాగేస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు అక్రమాలకు నిలయాలుగా మారాయి’ అని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో (తితలీ వల్ల శ్రీకాకుళం లేదు) విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇటీవల అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణపై ఆరోపణలు రావడంతో ఏకకాలంలో 80 బృందాలను విజిలెన్స్‌ చీఫ్‌ గౌతమ్‌ సవాంగ్‌ రంగంలోకి దింపారు. మొత్తం 162 కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించగా 66 చోట్ల లోపాలు, అక్రమాలు బయటపడ్డాయి. రెండేళ్లలోపు చిన్నారులకు అందించే బాలామృతం నుంచి గర్భవతులకు, బాలింతలకు అందించే పౌష్ఠికాహారం (బాల సంజీవని) పంపిణీ.. బాల, బాలికలకు గుడ్లు, పాలు ఎంతమేర అందిస్తున్నారు.? వాటి నాణ్యత, మరుగుదొడ్ల నిర్వహణ, ఆయాల సేవలు తదితర 23 అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇందులో అత్యధిక కేంద్రాల్లో హాజరు తేడా ఉన్నట్లు తేలింది. à°† తర్వాత గుడ్డు, పాలు పిల్లలకు సరఫరా చేయలేదని వెల్లడైంది. స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి పరిటాల సునీత సొంత జిల్లాలో ఏకంగా బాలామృతం (మాల్యవంతం, ముష్టూరు) ఇవ్వడం లేదని అధికారులు గుర్తించారు. చిత్తూరు జిల్లాలో ఎక్కువచోట్ల కుళ్లిన గుడ్లు కనిపించగా.. తనిఖీలు చేపట్టిన దాదాపు అన్ని కేంద్రాల్లోనూ చాలా చిన్న గుడ్లు సరఫరా చేస్తున్నట్లు తేలింది.