కష్టంలోనూ రాజకీయ లబ్ధికే ఆరాటం

Published: Tuesday October 23, 2018
ప్రజలు తుఫాను కష్టాల్లో ఉంటే అక్కడ కూడా రాజకీయ లబ్ధి పొందేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరాటపడుతున్నారని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. విజయనగరం జిల్లాలో సాగుతున్న పాదయాత్రలో భాగంగా సోమవారం సాలూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘తితలీ తుఫాను కారణంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ప్రజలు కష్టాల్లో ఉంటే వారి కష్టాలు తీర్చకుండా అక్కడ కూడా సీఎం రాజకీయం చేస్తున్నారు. 2014లో వచ్చిన హుద్‌హుద్‌ తుఫానుకు రూ.65 వేల కోట్ల నష్టం జరిగిందని ఆయన ప్రకటించారు. కేంద్ర హోంశాఖకు పంపిన లేఖలో మాత్రం రూ.926 కోట్లు ఖర్చు చేశామని చూపించారు. కేంద్రం రూ.550 కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసింది ముష్టి రూ.400 కోట్లే. మరి ప్రజలకు జరిగిన నష్టం రూ.65 వేల కోట్లు ఎప్పుడిస్తారు? తితలీ తుఫాను కారణంగా రూ.3,435 కోట్లు నష్టం వచ్చిందని ప్రకటించిన ప్రభుత్వం..
 
నేటివరకు బాధితులకు ఏం సాయం చేసిందో ప్రకటించలేదు. ప్రజలు సర్వం కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉండి సీఎంను నిలదీస్తే బుల్డోజర్లతో తొక్కిస్తాననడం ఎంతవరకు సబబు? ప్రతిపక్ష నేతగా నేను కష్టంలో ఉన్నవారి వద్దకు వెళ్తే సహాయం అడ్డుకుంటున్నామని అంటారు. వెళ్లకపోతే రాలేదని తప్పుడు విమర్శలు చేస్తారు. వారం తర్వాత తుఫాను ప్రాంతానికి నేను వెళ్తాను. ఈలోగా ప్రభుత్వం ఏంచేయాలనుకుంటోందో చేసి చూపాలి. లేదంటే 50 రోజుల పాటు అక్కడే పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకుని వైసీపీ ప్రభుత్వం వచ్చాక మొత్తం నష్టాన్ని ప్రజలకు అందిస్తాం’ అని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర అందించాల్సిన సీఎం దళారీలకు బ్రోకరుగా మారారని, రైతులు పండించిన కూరగాయలను కిలో రూ.15à°•à°¿ కొనుగోలు చేసి హెరిటేజ్‌లో రూ.40à°•à°¿ అమ్ముకుంటున్నారని దుయ్యబట్టారు. బాధితులకు న్యాయం చేయకుండా అగ్రిగోల్డ్‌ కంపెనీకి చెందిన విలువైన ఆస్తులు ఎలా కొట్టేయాలా అని చంద్రబాబు చూస్తున్నారన్నారు.
 
ఏదీ రుణమాఫీ..?
‘రైతులు, మహిళలకు రుణం మాఫీ అన్నారు. మాఫీ చేయలేదు సరికదా ప్రస్తుతం వారికి బ్యాంకుల్లో రుణాలు కూడా పొందలేని పరిస్థితి తీసుకొచ్చారు. పోలవరం పనులు మంత్రి యనమల వియ్యంకుడికి సబ్‌కాంట్రాక్టు ఇచ్చి రేట్లు పెంచుకుంటూ వందల కోట్లు దోచుకుంటున్నారు. కేంద్రం మొండిచేయి చూపటానికి కారణం చంద్రబాబే’ అని జగన్‌ ఆరోపించారు.