చంద్రబాబు అవినీతి చక్రవర్తి: జీవీఎల్

అనుమతి లేకుండా రాష్ట్రంలో సీబీఐ సోదాలు చేయకూడదని ఆంధ్రప్రదేశ్ తీసుకున్న నిర్ణయం అప్రజాస్వామికమని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ఈ నిర్ణయాన్ని సీబీఐ కోర్టుల్లో సవాల్ చేస్తే వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందని, ఈ నిర్ణయాలు కోర్టుల ముందు చెల్లవని స్పష్టం చేశారు. ఐటీ సోదాలకు వచ్చే అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించకపోతే కేంద్ర బలగాల సహకారం తీసుకోవలసి వస్తుందన్నార. ప్రైవేటు వ్యాపారులు, కాంట్రాక్టర్లపై ఐటీ సోదాలు జరిగితే టీడీపీ నేతలపై జరుగుతున్నట్లు సీఎం చంద్రబాబు బెంబేలెత్తిపోతున్నారని విమర్శించారు. తప్పు చేయకపోతే ఆయన ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతి చక్రవర్తిగా ఎదిగారని ధ్వజమెత్తారు. సీబీఐలో జరిగిన కొన్ని పరిణామాలను అనుకూలంగా మార్చుకుని తన అవినీతిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన అవినీతిపై రాజకీయంగా పోరాటం చేస్తామని ప్రకటించారు. సీబీఐ డైరెక్టర్, ప్రత్యేక డైరెక్టర్ మధ్య రేగిన వివాదంలో టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ పాత్ర కూడా ఉందని జీవీఎల్ చెప్పారు.

Share this on your social network: