పల్నాటి బిడ్డను.. బెదిరింపులకు భయపడను!

Published: Thursday November 22, 2018

తాటాకు చప్పుళ్లకు, ఉడుత ఊపులకు భయపడే వాడినికానని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. ఈనెల 23న గురజాలకు మంత్రి నారా లోకేష్‌ వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రతిపక్ష నేత జగన్‌పై కత్తితో దాడి చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి ఆదినారాయణరెడ్డి, తనకు ఏం సంబంధమన్నారు. ఎటువంటి విచారణకైనా తాము సిద్ధమన్నారు. ఇప్పటికే కోడి కత్తితో పరువు పొగొట్టుకున్నారు.. మిగిలిన ఆ కాస్త పరువునైనా కాపాడుకోండంటూ యరపతినేని హితవు పలికారు. సమావేశంలో మాచర్ల మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌ యా గంటి మల్లికార్జునరావు, టీడీపీ మండల అధ్యక్షుడు చపారపు అబ్బిరెడ్డి, ఎంపీపీ వడితే జీజాతులశ్యానాయక్‌, ఉపాధ్యక్షుడు గొంటు సుమంత్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు గాదె ఫాతిమా మర్రెడ్డి, డీసీ చైర్మన్‌ నల్లబిరుదు నరసింహారావు, సొసైటీ చైర్మన్‌ లింగా పున్నారావు తదితరులు పాల్గొన్నారు.